శూద్రులను వారి వర్ణంతో పిలిస్తే ఫీలవుతారట… వారికి వర్ణం అర్థం కాదు కాబట్టే అలా తప్పుగా భావిస్తారట! ఈ మాటలన్నది భోపాల్‌కు చెందిన బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆమెకు కొత్తేమీ కాకపోయినా ఇవి మాత్రం ఘాటైన మాటలే! మతపరమైన గ్రంథాలు, ధర్మశాస్త్రాల గురించి మాట్లాడుతూ ఆమె పలు విషయాలను చెప్పుకొచ్చారు. శూద్రులలో అవగాహనలోపం ఉందని ఆమె సూత్రీకరించారు. క్షత్రియులను క్షత్రియులని పిలిస్తే వారేమీ అనుకోరని, అలాగే బ్రాహ్మణులను కులం పేరుతో పిలిస్తే తప్పుగా అనుకోరని, వైశ్యులను వైశ్యులంటే ఏమీ అనుకోరని, శూద్రులను మాత్రం శూద్రులంటే తెగ ఫీలవుతారని ప్రజ్ఞా ఠాకూర్ అన్నారు. అందుకు కారణం వారి అవగాహనలోపమని తెలిపారు. అంతేనా.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కూడా ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై బెంగాల్‌లో జరిగిన దాడి పట్ల మమతా సరిగ్గా స్పందించలేదన్నారు.. బహుశా ఆమెకు పిచ్చిపట్టిందేమోనని ప్రజ్ఞాఠాకూర్ వ్యాఖ్యానించారు. ఇది ఇండియా-పాకిస్తాన్ కాదని మమతా తెలుసుకుంటే మంచిదని చెప్పారు. భారతదేశాన్ని రక్షించుకోవడానికి హిందువులు రెడీగా ఉన్నారని, మమతా బెనర్జీకి తగిన సమాధానం ఇస్తారని ప్రజ్ఞా ఠాకూర్ పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయం సాధించడం తథ్యమని, బెంగాల్‌లో హిందూ రాజ్యం ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. ఇక బెంగాల్‌లో తన హవా నడవదని గ్రహించారు కాబట్టే మమతలో అసహనం పెరిగిపోయిందని, ఉన్నదానికి లేనిదానికి కోపం తెచ్చుకుంటున్నారని ప్రజ్ఞా ఠాకూర్ అన్నారు.