
కేరళలో మళ్ళీ బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. అల్పౌజాలో పలు బాతులు మరణించగా.. వాటి నమూనాలను భోపాల్‌లోని హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్ డయాగ్నస్టిక్ లాబొరేటరీకి పంపించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో ఈ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు తేలింది. దీంతో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ తక్షణమే నివారణ చర్యలను తీసుకుంది. వ్యాధి సోకిన ప్రాంతాల చుట్టూ ఒక నిర్దిష్ట కిలోమీటరు పరిధిలో కోళ్లు, పక్షులు అమ్మకాలు, రవాణాపై ఆంక్షలు విధించారు. రిజల్ట్స్ వచ్చీరాగానే వ్యాధి గుర్తించబడిన ప్రాంతాల్లో పక్షులను చంపడం లాంటి తదుపరి చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించింది.
జిల్లాలోని ఎనిమిది పంచాయతీలలో ఈ వ్యాధి నమోదైంది. ప్రతి వార్డులో ఒకటి. కుట్టనాడ్‌లోని ఏడు పంచాయతీలలో 20,000 కి పైగా బాతులు బర్డ్ ఫ్లూ కారణంగా మరణించాయని నిర్ధారించారు. నెడుముడి, చెరుతన, కరువట్ట, కార్తీకప్పల్లి, అంబలప్పుళ సౌత్, పున్నప్రా సౌత్, తకజి లాంటి ప్రాంతాల్లో బాతులు చనిపోయాయి. ఇంతలో, కొట్టాయం జిల్లాలో కూడా బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. కురుపంతర, మంజూర్, కల్లుపురక్కల్ మరియు వెల్లూరు వార్డులలో ఈ వ్యాధిని గుర్తించారు. కోళ్లు, పిట్టలలో బర్డ్ ఫ్లూను గుర్తించారు.