
బీహార్ రాజధానిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పాట్నాలోని ఓ ఆసుపత్రిలో రాత్రిపూట మొబైల్ లైట్ ఉపయోగించి చికిత్స చేస్తున్నారు వైద్యులు. యూట్యూబ్ చూసి రోగులకు మందులు ఇస్తున్నారు. ఇలాంటి చికిత్స కారణంగా శనివారం(ఫిబ్రవరి 15) ఒక పిల్లవాడు మరణించాడు. దీంతో ఆ చిన్నారి కుటుంబం ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. ఈ విషయం రాజధాని పాట్నాలోని కదమ్ కువాన్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఉన్న శ్రీ అశోక్ హాస్పిటల్ అండ్ ట్రామా సెంటర్‌లో వెలుగు చూసింది.
బాలుడు వాంతులు, విరేచనాలు చేసుకోవడంతో ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు ఆ చిన్నారి కుటుంబ సభ్యులు తెలిపారు. పిల్లవాడిని చేర్చుకున్న వైద్యులు చికిత్స ప్రారంభించారు. వార్డులో వెలుతురు లేకపోవడంతో మొబైల్ లైట్ తో పిల్లవాడిని పరీక్షించారు. యూట్యూబ్ చూసి, పిల్లవాడికి మందులు ఇవ్వడం ప్రారంభించారు. ఈమేరకు మృతుడి తాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజేంద్ర నగర్ రోడ్ నంబర్ 3 లో ఉన్న ఈ ఆసుపత్రిని నకిలీ ఆసుపత్రి అని పేర్కొన్నారు. ఇక్కడ నకిలీ వైద్యులు, నకిలీ ల్యాబ్ టెక్నీషియన్లు ఉన్నారని అన్నారు. ఈ ఆసుపత్రిలో రోగులకు చికిత్స చేయడంతో పాటు ఆపరేషన్లు కూడా రాత్రిపూట మొబైల్ ఫోన్ల వెలుగులో యూట్యూబ్ చూడటం ద్వారా జరుగుతాయని ఆయన ఆరోపించారు.
తన మనవడి మరణానికి ఆసుపత్రి యాజమాన్యమే బాధ్యత వహించాలని ఆ చిన్నారి తాత డిమాండ్ చేశారు. వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం వేడెక్కడంతో, ఆసుపత్రి వైద్యుడు వివరణ ఇచ్చారు. రోగికి చికిత్స అందించామని చెప్పారు. అతను HBSA పాజిటివ్ వ్యాధితో బాధపడుతున్నందున, అతని పరిస్థితి అప్పటికే క్రిటికల్‌గా ఉందన్నారు. అయితే, ఇక్కడ ఏ వైద్యుడు ఈ చిన్నారికి చికిత్స చేశాడో చెప్పలేదు. అతను యూట్యూబ్ చూడటం ద్వారా చికిత్స చేశాడనడంలో నిజం లేదన్నారు.
వివాదం తీవ్రమవడంతో, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఒప్పించి శాంతింపజేశారు. దీని తరువాత, పోలీసులు చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం తీసుకుని పోస్ట్‌మార్టం కోసం పంపారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, సంఘటన జరిగిన సమయంలో ఆసుపత్రిలో విధుల్లో ఉన్న వైద్యులు, నర్సులు, నిర్వహణ సిబ్బంది పారిపోయారు. వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ కేసును అన్ని కోణాల నుండి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..