Bihar Hooch Tragedy: బీహార్‌లో కల్తీ మద్యం కలకలం రేపింది. సంక్రాంత్రి పండుగ వేడుకల్లో కల్తీ మద్యం తాగి ఇప్పటివరకు 11 మంది మరణించారు. ఈ ఘటన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సొంత జిల్లా నలందలో చోటుచేసుకుంది. శనివారం ఆరుగురు మరణించగా.. ఆదివారం మరో ఐదుగురు మరణించడం కలకలం రేపుతోంది. రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమల్లో ఉన్నప్పటికీ.. కల్తీ మద్యం కాటేస్తోందని పలువురు పేర్కొంటున్నారు.
శుక్రవారం రాత్రి నలంద సమీపంలోని చోటిపహరి, పహరితల్లి ప్రాంతాల్లో మద్యం తాగిన కొంతమంది అనారోగ్యానికి గురయ్యారు. దీంతో శనివారం మొత్తం 8 మంది మరణించగా.. ఈ రోజు మరో ముగ్గురు మృతిచెందినట్లు జిల్లా ఎస్పీ అశోక్ మిశ్రా తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఈ ఘటనపై అధికారులు చర్యలు ప్రారంభించారు.
కల్తీ మద్యాన్ని నియంత్రించడంలో విఫలమైన స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు.. పలువురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
కాగా.. 2016 నుంచి మద్యపాన నిషేధం అమల్లో ఉన్న బీహార్ రాష్ట్రంలో.. రెండు నెలల వ్యవధిలోనే కల్తీ మద్యం రక్కసికి 40 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే.. ఈ ఘటనలో మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు బాధిత కుటుంబాలు పేర్కొంటున్నాయి.
Also Read: