ఎంత పనిచేశావ్ తల్లి.. స్కూల్లో టీచర్ల వేధింపులు తట్టుకోలేక గుండెపగిలే నిర్ణయం..

ఒక చిన్న కారణం.. తోటి పిల్లల వేలెత్తి చూపడం.. స్కూల్ టీచర్ల వరుస ప్రశ్నలు.. ఆ విద్యార్థినిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. చివరకు వాటిని అవమనంగా భావించిన విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బెంగళూరు అర్బన్ జిల్లాలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. అసలేం జరిగింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఎంత పనిచేశావ్ తల్లి.. స్కూల్లో టీచర్ల వేధింపులు తట్టుకోలేక గుండెపగిలే నిర్ణయం..
Bengaluru Schoolgirl Ends Life

Updated on: Jul 11, 2026 | 10:11 AM

స్కూల్లో జరిగిన ఒక చిన్న ఘటన, ఆపై ఉపాధ్యాయుల విచారణ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. బెంగళూరు అర్బన్ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల విద్యార్థిని గురువారం తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. స్కూల్ యాజమాన్యం వేధించడం వల్లే తన కూతురు బలవన్మరణానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. సదరు విద్యార్థిని, ఆమెతో పాటు మరికొందరు సహచర విద్యార్థులు కలిసి ఓ టీచర్‌కు ముద్దుపేరు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థినులను పిలిచి విచారించారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు ఆ బాలికే ఈ పని చేసిందని వేలెత్తి చూపించారు. దీంతో స్కూల్ అధికారులు మంగళవారం నుండి గురువారం వరకు వరుసగా మూడు రోజుల పాటు ఆ బాలికను తీవ్రంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

ఇంట్లో ఆత్మహత్య

ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక గురువారం స్కూల్ నుండి వచ్చాక ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు గమనించే సరికి ఆమె మృతి చెంది ఉంది. పాఠశాలలో జరిగిన ఘటనపై మూడు రోజుల పాటు వరుసగా విచారించడంతో ఆ బాలిక తీవ్రమైన అవమాన భారానికి లోనైనట్లు ఆమె రాసిన సూసైడ్ నోట్ ద్వారా తెలుస్తోందిని పోలీసులు వెల్లడించారు.

ఆ ఆరోపణలు అబద్ధం

హోమ్‌వర్క్ చేయని విద్యార్థుల నుండి పాఠశాలలో రూ.10 లేదా రూ.20 జరిమానా వసూలు చేసే అలవాటు ఉందని.. తనకు సైతం రూ.20 ఫైన్ విధించినట్లు బాలిక డెత్ నోట్‌లో రాసినట్లు పోలీసలు వెల్లడించారు. అయితే టీచర్లు ముద్దుపేరు ఘటనకు సంబంధించి తీవ్రంగా ప్రశ్నించడంతోనే ఈ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

విచారణ జరుపుతున్న పోలీసులు

బాధిత బాలిక తల్లి మాట్లాడుతూ.. ‘‘స్కూల్లో టీచర్లు నా బిడ్డను వేధించారని తెలిసింది. కానీ ఏ టీచర్, అసలేం జరిగిందనేది నాకు పూర్తిగా తెలియదు” అని కన్నీరుమున్నీరయ్యారు. కాగా ఈ ఘటనపై స్థానిక విద్యాశాఖ అధికారి గురుమూర్తి పాఠశాలను సందర్శించి శాఖాపరమైన విచారణ చేపట్టారు. పోలీసులు ఈ ఘటనపై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి, తోటి విద్యార్థులు, స్కూల్ సిబ్బంది స్టేట్‌మెంట్లను రికార్డు చేస్తున్నారు.

Follow Us