Food poisoned in Assam : విందు భోజనం జనం ప్రాణాల మీదకు తెచ్చింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి పాల్గొన్న కార్యక్రమంలో ఏర్పాటు చేసిన విందులో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రితో సహా 145 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన అసోం రాష్ట్రంలో చోటుచేసుకుంది.
అసోం రాష్ట్రం కర్బి అంగ్లాంగ్ జిల్లాలోని మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్ అకడమిక్ సెషన్ ప్రారంభోత్సవానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మ తదితరులు హాజరయ్యారు.
అయితే, కార్యక్రమం అనంతరం కాలేజ్ యాజమాన్యం విందు భోజనాలు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎనిమిదివేల మందికి బిర్యానీ ప్యాకెట్‌ను సరఫరా చేశారు. ఈ ఆహారం తిన్న 145 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా అస్వస్థతకు లోనవడంతో దిపు మెడికల్ కాలేజ్‌లో చికిత్స పొందుతున్నారు. బిర్యానీ తీసుకున్న అనంతరం తాను కూడా అనారోగ్యానికి గురయ్యానని, ఇప్పుడు కోలుకున్నానని ఆయన చెప్పారు. కాగా, ఈ విందుకు హాజరైన వారిలో పలువురు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు.
మంగళవారం రాత్రి నుంచి 145 మందిని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా చికిత్సపొందుతున్న వారిలో 28 మంది ఇప్పటివరకూ డిశ్చార్జి అయ్యారని మంత్రి శర్మ తెలిపారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై న్యాయ విచారణకు ఆదేశించామని కర్బి అంగ్లాంగ్ డిప్యూటి కమిషనర్ చంద్ర ధ్వజ సింఘ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మరణించడం కలకలం రేపింది. ఫుడ్ పాయిజన్‌తోనే ఆయన మరణించారా అనేది ఇంకా తేలాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆహార నమూనాలను సేకరించి పరీక్షలకు పంపామని పేర్కొన్నారు.
Read Also….Union Bank Fraud: బ్యాంకులో “చిల్లర దొంగలు”.. రూ.15లక్షలు మాయం చేశారు.. ఇంటి దొంగల పనేనా..?