‘ఇదంతా ఎవరి స్కెచ్‌..?’ NCERT తీరుపై హీరో మాధవన్‌ ఆగ్రహం..

ఇటీవల NCERT సిలబస్‌ నుంచి మొఘల్‌ చాప్టర్‌లను తొలగించిన సంగతి తెలిసిందే. NCERT పాఠశాల పాఠ్యపుస్తకాల్లోని అనేక చరిత్ర అధ్యాయాలను సవరించడంపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో నటుడు మాధవన్‌ కూడా స్పందించారు. స్కూల్‌ పిల్లల సిలబస్‌ విషయమై NCERT తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..

ఇదంతా ఎవరి స్కెచ్‌..? NCERT తీరుపై హీరో మాధవన్‌ ఆగ్రహం..
Actor R Madhavan

Updated on: May 04, 2025 | 7:36 PM

దక్షిణాది అగ్ర నటుడు మాధవన్ అందరికీ సుపరిచితమే. నటనలో తనదైన స్టైల్‌లో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే తాజాగా మాధవన్‌ స్కూల్‌ పిల్లల సిలబస్‌ విషయమై NCERT తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో పాఠశాలల్లో ఇండియన్‌ హిస్టరీ బోధించే విధానంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ప్రగతికి ప్రాచీన చరిత్ర ఎంతో ముఖ్యమని.. అయితే దక్షిణాది దేశ చరిత్రలు మాత్రం నిర్లక్ష్యానికి గురవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీనిపై నటుడు మాధవన్‌ స్పందిస్తూ..

‘ఇండియన్‌ హిస్టరీపై ఇలా నా అభిప్రాయాలు చెప్పడం వల్ల ఇబ్బందుల్లో పడవచ్చు. కానీ నేను చెప్పడానికి ఏమాత్రం వెనకాడను. స్కూల్లో చరిత్ర చదివినప్పుడు మొఘలుల గురించి దాదాపు ఎనిమిది అధ్యాయాలు ఉన్నాయి. హరప్పా, మొహెంజో-దారో నాగరికతలపై రెండు, బ్రిటిష్ పాలన – స్వాతంత్ర్య పోరాటంపై నాలుగు, దక్షిణ రాజ్యాలు – చోళులు, పాండ్యులు, పల్లవులు, చేరాలు గురించి ఒక అధ్యాయం మాత్రమే ఉండేవి. మొఘలులు, బ్రిటిష్ వారు కలిపి 800 సంవత్సరాలు పరిపాలించిన దానికంటే భిన్నంగా చోళ సామ్రాజ్యం చరిత్ర 2,400 సంవత్సరాల పురాతనమైనది. చోళులు సముద్ర ప్రయాణం, నావికా శక్తికి మార్గదర్శకులు. వారికి రోమ్ వరకు విస్తరించిన సుగంధ ద్రవ్య వ్యాపార మార్గాలు ఉన్నాయి. మన చరిత్రలో ఆ భాగం ఎక్కడ ఉంది? మన శక్తివంతమైన నావికా దళాలతో అంగ్కోర్ వాట్ వరకు దేవాలయాలను నిర్మించిట్లు ఎక్కడ ప్రస్తావన ఉంది? జైన మతం, బౌద్ధమతం, హిందూ మతం చైనాకు వ్యాపించాయి. కొరియాలోని ప్రజలు సగం మంది తమిళం మాట్లాడతారు. ఎందుకంటే మన భాష అంత దూరం చేరుకుంది. ఇవన్నీ ఒకే అధ్యాయంలో క్లుప్తంగా ఇచ్చారు. ప్రపంచంలోనే అతి పురాతన భాషగా గుర్తింపు పొందిన తమిళం ఎందుకు విస్తృతంగా గుర్తింపు పొందలేదు? అని మాధవన్ ఇన్‌స్టా వేదికగా ప్రశ్నించారు. ఇది ఎవరి స్కెచ్‌? సిలబస్‌ను ఎవరు నిర్ణయించారు? తమిళం ప్రపంచంలోనే అతి పురాతన భాష. కానీ దాని గురించి ఎవరికీ తెలియదు. మన సంస్కృతిలో దాగి ఉన్న శాస్త్రీయ జ్ఞానం ప్రస్తుతం అపహాస్యం అవుతుందని’ ఆయన ఆవేదన చెందారు.

మాధవన్ వలసరాజ్యాల కాలం నాటి కథనాలపై కూడా మండిపడ్డారు. జలియన్ వాలాబాగ్ ఊచకోతను పాఠ్యపుస్తకాల్లో ఎలా చిత్రీకరించారో విమర్శించారు. బ్రిటిషర్ల చరిత్ర వెర్షన్ మనకు ‘హమ్నే జలియన్ వాలాబాగ్ మే బద్మాషి కియే హోంగే’ (జలియన్ వాలాబాగ్‌ ఉదంతంలో మనం ఏదో తప్పు చేసి ఉంటాం) అని బోధిస్తుందని ఆయన అన్నారు. కేసరి చాప్టర్ 2 అనేది 1919 జలియన్ వాలాబాగ్ ఊచకోత తరువాత జరిగిన సంఘటనల కల్పిత కథనం. ఇది ‘ది కేస్ దట్ షుక్ ది ఎంపైర్’ పుస్తకం ఆధారంగా మాత్రమే రూపొందిందని, అది చరిత్రలో జరిగిన సంఘటన కాదని తెలిపారు.

ఇవి కూడా చదవండి

కాగా ఇటీవల NCERT సిలబస్‌ నుంచి మొఘల్‌ చాప్టర్‌లను తొలగించిన సంగతి తెలిసిందే. NCERT పాఠశాల పాఠ్యపుస్తకాల్లోని అనేక చరిత్ర అధ్యాయాలను సవరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మాధవన్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. కొత్త 7వ తరగతి చరిత్ర సిలబస్‌లో ఢిల్లీ సుల్తాన్‌, మొఘల్ సామ్రాజ్యం గురించిన పెద్ద చాప్టర్‌లను, సామాజిక ఉద్యమాలు, కుల వ్యవస్థకు సంబంధించిన సూచనలను NCERT తొలగించింది. వీటి స్థానంలో మేక్ ఇన్ ఇండియా, బేటీ బచావో బేటీ పఢావో వంటి ఇటీవలి ప్రభుత్వ పథకాలు, చార్ ధామ్ యాత్ర వంటి మతపరమైన తీర్థయాత్రలపై కొత్త చేర్పులు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించడంపై పలువురు కన్నెర్ర చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.