
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ అభినందనలు తెలిపారు. భారతదేశ చరిత్రలోనే అత్యధిక కాలం ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన నాయకుడిగా గుర్తింపు పొందిన మోదీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ టిమ్ కుక్ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ప్రత్యేక పోస్టు చేశారు. ప్రజల జీవితాలను మెరుగుపరిచే ఆవిష్కరణలకు మద్దతు అందిస్తున్నందుకు ప్రధాని మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
టిమ్ కుక్ పోస్టుకు స్పందించిన ప్రధాని మోదీ, గత కొన్ని రోజులుగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రజల నుంచి శుభాకాంక్షలు అందుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి సందేశానికి వ్యక్తిగతంగా స్పందించడం సాధ్యం కాకపోయినా, అందరి ప్రేమాభిమానాలను హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నానని తెలిపారు. భారతదేశానికి సేవ చేసే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని మోదీ అన్నారు.
దేశ ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా స్థిరత్వం, సుపరిపాలన, అభివృద్ధికి మద్దతుగా ఓటు వేస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు. ‘వికసిత భారత్’ లక్ష్య సాధన కోసం, 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మరింత కృషి చేస్తానని ప్రధానమంత్రి నరేంద్ర మొదీ స్పష్టం చేశారు.
Deeply touched by the good wishes conveyed by people from all walks of life today and over the last few days. While I may not have been able to respond to each message individually, I cherish every greeting conveyed.
I consider it a privilege to have the opportunity to serve…
— Narendra Modi (@narendramodi) June 10, 2026
ఇదిలా ఉండగా, గత నెలలో ఆపిల్ సంస్థ ఆర్థిక ఫలితాల సందర్భంగా టిమ్ కుక్ భారత మార్కెట్‌పై ప్రత్యేకంగా స్పందించారు. జనవరి-మార్చి త్రైమాసికంలో కంపెనీ ప్రపంచవ్యాప్తంగా బలమైన వృద్ధిని నమోదు చేసిందని, అభివృద్ధి చెందిన దేశాలతో పాటు వర్ధమాన మార్కెట్లలో కూడా రికార్డు స్థాయి ఆదాయాలు సాధించినట్లు వెల్లడించారు. ముఖ్యంగా భారతదేశంలో రెండంకెల వృద్ధి నమోదైందని, గత కొన్నేళ్లుగా దేశంలో ఆపిల్ వ్యాపారం నిరంతరం విస్తరిస్తుండటం సంతోషకరమని పేర్కొన్నారు. భారతీయ వినియోగదారులతో మరింత అనుసంధానం కావడం కంపెనీ దీర్ఘకాల వ్యూహంలో కీలక భాగమని టిమ్ కుక్ వివరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..