
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాలో పైప్ లైన్ కోసం కాలవ తవ్వకం ఓ ఆశ్చర్యకర ఘటనగా మారింది. కువార్సీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో పైప్‌లైన్ పనులు చేస్తున్న సమయంలో ఓ కార్మికుడి గడ్డపారతో తవ్వుతుండగా భూమిలోనుంచి ఓ సంచి బయటపడింది. ఏంటా అని చూడగా ఆ సంచి లోపల పదకొండు బంగారు నాణేలు కనిపించాయి. ఈ ఘటన గురువారం చోటు చేసుకోగా.. నాణేల గురించి సమాచారం అర్థరాత్రి పోలీసులకు చేరింది. వెంటనే స్పందించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ నాణేలను స్వాధీనం చేసుకున్నారు.
“సమాచారం అందిన వెంటనే మా టీమ్ అక్కడికి వెళ్లింది. మొత్తం పదకొండు బంగారు నాణేల్ని స్వాధీనం చేసుకున్నాం. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది” అని సర్కిల్ ఆఫీసర్ సర్వం సింగ్ చెప్పారు.నాణేలను ముందుగా ఒక స్థానిక ఆభరణాల దుకాణానికి తీసుకెళ్లి పరీక్షించారు. అక్కడ అవి బంగారంతో తయారయినట్లు కన్ఫామ్ అయింది. వాటిపై ప్రాథమికంగా పర్షియన్ లిపి కనిపించిందని అధికారులు వెల్లడించారు. దీనితో వీటికి చారిత్రక ప్రాధాన్యం ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
ఈ వార్త గ్రామంలో వ్యాపించగానే పెద్ద ఎత్తున జనం అక్కడికి చేరుకున్నారు. కొంతమంది నాణేలు తమకే చెందుతాయని గొడవకు దిగినట్లు సమాచారం. అయితే పోలీసుల, గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ కాయిన్స్ మూలం ఏంటి, వాటి చరిత్ర, విలువ వంటివి పూర్తి స్థాయిలో పరిశీలించేందుకు నిపుణుల వద్దకు పంపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Gold Coins
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..