
మన జనాలకు ఎలాంటి శ్రమ పడకుండా ఎక్కడైనా ఏదైనా దొరుకుతుందని అంటే చాలు.. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ముందు ఇదే పనిగా పెట్టుకుంటారు. కష్టపడకుండా ఊరికే దొరికేది ఎక్కువ కాలం ఉండదని అందరూ అంటారు కానీ.. ఏదైనా దొరికితే మాత్రం తమకు అదృష్టం కలిసి వచ్చిందని చెప్పుకుంటారు.సహజంగా మనిషి నైజమే అంత.. ఆశ ఉండడంలో తప్పు లేదు. కానీ, అది శృతి మించి అత్యాశకు దారి తీస్తేనే పరిస్థితులు తారుమారు అవుతాయనే విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తు ఉంచుకోవాలి. సరిగ్గా ఇలాంటి వింత ఘటనకు సంబంధించిన వార్తే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాజస్థాన్‌లో ఓ బోరుబావిలో వెండి లాంటి వస్తువు ఒకటి బయటపడింది. అది విలువైన వస్తువుగా భావించిన వ్యక్తి మొదట.. వేరే వాళ్లకు చూపించగా ఆ విషయం ఆ ప్రాంతమంతా వ్యాపించింది. దీంతో స్థానికంగా తీవ్ర కలకలం మొదలైంది. గురువారం రోజు ఆరావళి శ్రేణిలో ఉన్న అల్వార్ నగరం అల్కాపురి కాలనీలో బోర్‌వెల్ తవ్వకం సమయంలో నీటి సరఫరా శాఖ వెండి లాంటి వస్తువును ఒకటి గుర్తించడంతో ఈ ఆరాటం మొదలైంది. దీంతో ఆ ప్రదేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. బోరు బావి నుంచి వెలువడిన బురదలో వెండి లాగా మెరిసే గుణం ఉన్న రాళ్లు బయట పడుతుండడంతో డ్రిల్లింగ్ కార్మికులు, దుకాణదారులు, స్థానికులు ఆ రాళ్లను వెతికే పనిలో మునిగిపోయారు. ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అయ్యి.. అప్పటికప్పుడు ఆ విషయం మరిన్ని ప్రాంతాలకు చేరవేసినట్లయింది.
రాజస్థాన్‌లోని అల్వార్ ప్రాంతంలో నీటి కొరత అధికంగా ఉంది. ఆ జిల్లా మొత్తం గొట్టపు బావులపైనే ఆధారపడుతుంది. ఉపరితలంలో నీరు లేకపోవడం వల్ల అక్కడి స్థానికులు ఎంతో కాలంగా తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. దీంతో రానున్న రోజుల్లో సమస్యలు ఎదురుకాకుండా ఉండేందుకు వేసవి ప్రారంభం కావడానికి ముందే నీటి సరఫరా విభాగం నగరమంతటా వివిధ ప్రాంతాలలో బోర్లు వేయడానికి పూనుకుంది. ఇదే క్రమంలో రెండు రోజుల క్రితం, నగరంలోని అల్కాపురి కాలనీలోని ఒక షాపింగ్ కాంప్లెక్స్ మధ్యలో ఒక బోరుబావి తవ్వారు. అదే ఇప్పుడు ఇంత గందరగోళానికి దారి తీసింది. బోరు బావి వేసిన తర్వాత పైకి వచ్చిన మట్టిలో నుంచి మెరిసే వెండి లాంటి వస్తువు ఒకటి బయటపడడంతో అది ఆ నోటా ఈ నోటా పాకి ఆ ప్రాంతం జనసంద్రంగా మారింది. ఆ బురద మట్టిలో ఇంకా ఏమైనా ఇలాంటి విలువైన రాళ్లు దొరుకుతాయేమోనని ప్రజలు బట్టలు విప్పి మరీ వెతుకులాట ప్రారంభించారు. ఈ క్రమంలో జనాల మధ్య తొక్కిసలాట జరుగుతున్నా తమ ప్రయత్నాలు మాత్రం ఆపలేదు.
ఇదంతా బాగానే ఉంది కానీ, అసలు మెరుస్తున్న ఈ రాళ్లు ఎంతవరకూ విలువైనవో, అసలు వెండి అవునో కాదో ఇప్పటికీ తేలని ప్రశ్నే, తవ్వకం సమయంలో వెండిని వెలికితీస్తున్నారని తెలిసిన వెంటనే ఆ ప్రదేశంలో పెద్ద సంఖ్యలో జనం గుమిగూడడం, వాళ్లకూ దొరుకుతాయేమోనని వెతుకులాట ప్రారంభించడం తప్పితే ఆ వస్తువు నిజంగా విలువైందేనా అని అక్కడ ఎవరికీ స్పష్టత లేదు. ప్రస్తుతం వెండి ధరలు కూడా ఆకాశాన్ని అంటుతుండడంతో ప్రజలు ఇలా ఆశ పడి దొరికింది దొరికినట్లుగా తీసుకెళదామని ప్రయత్నాలు చేశారు. ఈ విషయాన్ని కొందరు స్థానికులు ఆ ప్రాంత అధికారులకు తెలియజేశారు. బోరుబావి తవ్విన ప్రాంతంలో జనం ఎక్కువగా గుమిగూడడంతో గందరగోళం నెలకొందని, ఆ ప్రాంతంలో రాకపోకలకు ఇబ్బందిగా మారిందని ఫిర్యాదు చేశారు. కాగా బయటపడింది ఏ లోహం అనేది అధికారికంగా ధృవీకరించబడలేదు.