Indian 10-rupee coin: అసలు మన దేశంలో 10 రూపాయల కాయిన్స్ చెల్లుబాటులో ఉన్నాయా..? అన్నది ప్రతి పౌరుడి మనసులో ఉన్న ప్రశ్న. ఎందుకంటే రూ.10 కాయిన్స్ ఇప్పుడు ఎక్కడా తీసుకోవడం లేదు. ఆటో ఎక్కి.. దిగిన తర్వాత రూ.10 కాయిన్ ఇస్తే.. ఇది చెల్లదు అని అటు వైపు నుంచి ఆన్సర్ వస్తుంది. ఏ షాపుకు వెళ్లినా.. పెట్రోల్ బంక్ అయినా, ఛాయ్ దుకాణమైనా.. ఇదే ఆన్సర్. కాస్త అవగాహన ఉన్నవారు… అరె.. రూ.10 కాయిన్స్ వాడుకలోనే ఉన్నాయి అంటే.. ‘ఏమో మా దగ్గర ఎవరూ తీసుకోవడం లేదు.. అందుకే మేము కూడా తీసుకోవడం మానేశాం’.. ఇది తిరిగి వస్తున్న సమాధానం. 10 నాణేలు చెల్లుబాటులోనే ఉన్నాయని పలుసార్లు వివరించే ప్రయత్నం చేసింది టీవీ9. కాగా తాజాగా ఇదే అంశంమై పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ‘రూ.10 కాయిన్స్ నకిలీవన్న ఉద్దేశంతో దేశంలో చెల్లుబాటు కావడంలేదా? వాటి చెల్లుబాటు కోసం కేంద్రం ఏమైనా చర్యలు తీసుకుంటోందా?’ అని తమిళనాడుకు చెందిన ఏఐఏడీఎంకే మెంబర్ ఎ.విజయకుమార్ ప్రశ్నించారు. దీనిపై కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి వివరణ ఇచ్చారు. దేశంలో రూ.10 నాణేలు చెల్లుబాటులో ఉన్నాయని, వాటిని ఆర్‌బీఐ ముద్రించి చెలామణిలో ఉంచిందని వెల్లడించారు.
‘‘కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఆర్‌బీఐ రూ.10 కాయిన్స్ వివిధ సైజులు, డిజైన్లలో ముద్రిస్తోంది. అవన్నీ చెల్లుబాటులో ఉన్నాయి. రూ.10 కాయిన్స్ అన్ని లావాదేవీలకు వాటిని వినియోగించవచ్చు. అయితే రూ.10 నాణేలను తీసుకోవడంలేదని పౌరుల నుంచి కంప్లైంట్స్ అందుతున్నాయి. దీని గురించి ఆర్‌బీఐ చర్యలు చేపడుతోంది. ప్రజల్లో ఉన్న అపోహలు, అనుమానాలను తొలగించడానికి ఎప్పటికప్పుడు పత్రికా ప్రకటనలు విడుదల చేస్తోంది. నిస్సందేహంగా అన్ని లావాదేవీల్లో పది రూపాయల కాయిన్స్ తీసుకోవచ్చని ప్రజలకు చెబుతూ వస్తోంది. దేశవ్యాప్తంగా దీనిపై ఎస్‌ఎంఎస్ అవగాహన ఉద్యమం నిర్వహిస్తోంది’’ అని కేంద్రమంత్రి పంకజ్ చౌదరి పేర్కొన్నారు.
Also Read: Andhra Pradesh: నాడు-నేడు పథకానికి విరాళాలు.. భవనాలకు దాతల పేర్లు పెట్టడంపై కొత్త నిబంధనలు