కొంపముంచిన ఫోటో.. భర్త ఫోన్‌లో కనిపించిన దృశ్యం.. భార్య కీలక నిర్ణయం..!

గురుగ్రామ్‌లో ఎయిర్ ఇండియా ఉద్యోగి భార్య కీర్తిమయి మిశ్రా ఆత్మహత్య కలకలం రేపింది. భర్త మొబైల్‌లో సహోద్యోగి ఫోటో చూసి దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తీవ్ర మనస్తాపంతో కీర్తిమయి బలవన్మరణానికి పాల్పడింది. స్మార్ట్ వరల్డ్ కంపెనీలో హెడ్‌గా పనిచేస్తున్న ఆమె మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన కుటుంబ కలహాలు, మానసిక ఆరోగ్యంపై చర్చకు దారితీస్తోంది.

కొంపముంచిన ఫోటో.. భర్త ఫోన్‌లో కనిపించిన దృశ్యం.. భార్య కీలక నిర్ణయం..!
Gurugram Kirtimayi Mishra

Updated on: Aug 29, 2026 | 10:25 AM

దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌ సెక్టార్-71లో ఉన్న ఓ విలాసవంతమైన సొసైటీలో ఎయిర్ ఇండియా ఉద్యోగి భార్య కీర్తిమయి మిశ్రా (44) ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్త మొబైల్ ఫోన్‌లో మహిళా సహోద్యోగితో కలిసి ఉన్న ఫోటో కనిపించడంతో భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత కీర్తిమయి మరో గదిలోకి వెళ్లి బలవన్మరణానికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం (ఆగస్టు 26) రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో కీర్తిమయి తన భర్త యువరాజ్ శర్మ, తొమ్మిదేళ్ల కుమార్తెతో కలిసి ఉంది. ఆ సమయంలో యువరాజ్ మొబైల్ ఫోన్‌‌ గ్యాలరీని కీర్తిమయి చూసింది. అందులో ఎయిర్ ఇండియా అకాడమీకి చెందిన ఫొటోల మధ్య ఓ మహిళా సహోద్యోగితో భర్త ఉన్న ఫొటో కనిపించింది. దీంతో ఆమె భర్తను ప్రశ్నించగా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

గొడవ అనంతరం కీర్తిమయి కోపంతో మరో గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. రాత్రి సమయానికి ఆమె కోపం తగ్గి ఉదయానికి పరిస్థితి సాధారణమవుతుందని యువరాజ్ భావించినట్లు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. అయితే ఉదయం ఎంతసేపటికీ తలుపు తెరవకపోవడంతో అతడు తలుపు తట్టాడు. స్పందన లేకపోవడంతో బాల్కనీ కిటికీ ద్వారా చూడగా కీర్తిమయి సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది.

తలుపు తెరవడానికి యువరాజ్ గాజును పగలగొట్టడంతో చేతులు, మోకాళ్లకు గాయాలయ్యాయి. అనంతరం పోలీసులకు, స్నేహితులకు సమాచారం అందించాడు. బాద్షాహ్‌పూర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించారు.

కీర్తిమయి ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందినవారు. గురుగ్రామ్‌లోని స్మార్ట్ వరల్డ్ కంపెనీలో లెర్నింగ్ అండ్ టాలెంట్ డెవలప్‌మెంట్ విభాగాధిపతిగా పనిచేస్తున్నారు. యువరాజ్ శర్మ ముంబైకి చెందినవాడు కాగా, ఎయిర్ ఇండియాలో క్యాబిన్ సిబ్బందికి శిక్షణ ఇచ్చే ఉద్యోగం చేస్తున్నాడు. వీరిద్దరూ సుమారు 15 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి తొమ్మిదేళ్ల కుమార్తె ఉంది.

కీర్తిమయి తమ్ముడు విదేశాలకు చదువుల కోసం వెళ్లే ముందు రాఖీ కట్టించుకోవడానికి కేవలం నాలుగు రోజుల క్రితమే తన సోదరిని కలిశాడు. ఆమె మరణవార్త తెలియగానే శుక్రవారం ఉదయం గురుగ్రామ్‌కు తిరిగి వచ్చాడు. ప్రస్తుతం పోలీసులు ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు చేసి, ఘటనకు దారితీసిన పరిస్థితులపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us