భారత వైమానిక కేంద్రాలకు ఉగ్ర ముప్పు ఉందని కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. పఠాన్‌కోట్ తరహా దాడులు చేసేందుకు పాక్ ఉగ్రవాదులు యత్నిస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత వాయుసేన దళాలను అప్రమత్తం చేసినట్లు ఎయిర్ చీప్ మార్షల్ బీఎస్ ధనోవా వెల్లడించారు. ఢిల్లీలోని వైమానిక కేంద్రంలో రెండు రోజుల పాటు జరుగుతున్న వాయుసేన కమాండర్ల సమావేశంలో ధనోవా మాట్లాడారు. భారత వాయుసేన దళాలు అనుక్షణం అప్రమత్తంగా, ఉగ్రవాద దాడులను తిప్పికొట్టేందుకు సన్నద్ధంగా ఉండాలని ధనోవా కోరారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత పాకిస్తాన్ రెచ్చగొట్టేలా బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేస్తుందని ధనోవా ఆరోపించారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా.. వాటిని ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.