
గుజరాత్ విమాన ప్రమాదం యావత్ ప్రపంచాన్ని షాక్ కు గురిచేసింది. అయితే.. ఇంతటి విషాదంలోనూ ఊహించలేని ఓ అద్భుతం చోటు చేసుకుంది. టేకాఫ్ అయిన విమానం కళ్ల ముందే మంటల్లో చిక్కుకుని బూడిద కుప్పగా మారిపోయింది. దాదాపుగా విమానంలోని మొత్తం 242 మందిలో ఏ ఒక్కరూ బతికి బట్టకట్టే అవకాశమే లేదనే వాతావరణం నెలకొన్న వేళ.. 34 ఏళ్ల ఓ యువకుడు విమాన ప్రమాదం నుంచి అత్యంత స్పల్ప గాయాలతో ప్రమాద స్థలి నుంచి నడుచుకుంటూ వచ్చాడు. తాను విమానంలోని 11 A సీటులో కూర్చున్నానని.. ప్రమాదం నుంచి తప్పించుకుని వచ్చానని అతడు చెప్పటంతో అక్కడున్న వాళ్లంతా నోరెళ్లబెట్టారు. రమేష్ విశ్వాస్ కుమార్ అనే ఈ యువకుడి వివరాలను టికెట్ల జాబితాలో చెక్ చేసిన అధికారులు అతడిని వెంటనే అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.
ఈ నేపథ్యంలో 11 A సీటు ప్రత్యేకత ఏమిటా అని నెటిజన్లు సెర్చ్ చేస్తుండగా.. ఆశ్చర్య పోయే వివరాలు తెలిశాయి. బోయింగ్ విమానంలో 11A సీటు.. ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ (PAC)కి సమీపంలో ఉండటం వల్ల అక్కడ కిటికీ ఉండదు. దీంతో ఈ సీటును సాధారణంగా ఎవరూ ఎంచుకోరు. ముఖ్యంగా పది గంటలపైగా ప్రయాణించాల్సిన విదేశీ ప్రయాణాల్లోనైతే.. 11ఏ సీటు తీసుకోవడానికి అసలే ఇష్టపడరు. యూరోప్ దేశాల్లోనైతే.. ఈ సీటు మీద బోలెడు జోకులూ ఉన్నాయి. అలాగే ఈ 11ఏ సీట్ ధర రూ. 1 లక్ష పైగా ఉంటుందని తెలుస్తోంది. కానీ. రమేష్ మాత్రం ఈ సీటుతో ఎడ్జస్ట్ అయి.. లండన్ బయలుదేరాడు. ఎమర్జెన్సీ మార్గానికి దగ్గరగా ఉండటం వల్లనో ఏమో.. మొత్తానికి మృత్యుంజయుడిగా బయటపడ్డాడు.