రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమ్ ఇండియా క్రికెటర్ రిషబ్ పంత్‌ను ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామి ఆస్పత్రిలో పరామర్శించారు. డెహ్రాడూన్ లోని మ్యాక్స్ ఆస్పత్రికి చేరుకున్న సీఎం పుష్కర్‌సింగ్ ధామి.. రిషబ్ పంత్ ఆరోగ్యపరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రిషబ్ పంత్ ను పరామర్శించి.. సీఎం ధామి మాట్లాడారు. శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన భారత బ్యాటర్ మ్యాక్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై రోడ్డుపై ఉన్న గుంత వల్లే ప్రమాదం జరిగిందని పంత్ తనకు తెలియజేసినట్లు సీఎం పుష్కర్ సింగ్ ధామి పేర్కొన్నారు. పంత్‌తో భేటీ అనంతరం ఉత్తరాఖండ్ సీఎం మీడియాతో ముచ్చటించారు. పంత్ ఆరోగ్యంపై స్పందిస్తూ.. ప్రమాదంలో తగిలిన గాయాల కారణంగా రిషబ్ పంత్ శరీరంలో నొప్పిని అనుభవిస్తున్నాన్నారు. డాక్టర్ల ప్రకారం, వచ్చే 24 గంటల్లో నొప్పి తగ్గుతుందని తెలిపారు.
పంత్ ప్రమాదానికి గురైన తర్వాత చాలా మంది తనకు సహాయం చేశారని చెప్పారని సీఎం ధామి పేర్కొన్నారు. అతనికి వైద్య చికిత్స ఇక్కడ కొనసాగుతుందని.. మాక్స్ హాస్పిటల్ వైద్యుల ప్రకారం ధామి వివరించారు. క్రికెటర్ కారు ప్రమాదానికి గురైన తర్వాత ఉత్తరాఖండ్ సీఎం ధామి.. పంత్ కుటుంబంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. పంత్ ఆరోగ్యంపై సీఎంకు సమాచారం అందించే బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంతకుముందు, ఢిల్లీ & డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ శ్యామ్ శర్మ మాక్స్ హాస్పిటల్‌లో పంత్‌ను కలవడానికి వెళ్లారు. ఈ భయంకరమైన ప్రమాదానికి కారణమైన గుంత గురించి భారత క్రికెటర్ అతనికి తెలియజేసినట్లు వెల్లడించారు.
Uttarakhand CM Pushkar Singh Dhami visits Max hospital, Dehradun, to meet cricketer #RishabhPant who is currently under medical treatment at the hospital following a car accident two days ago pic.twitter.com/rpWxG1HyL6
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 1, 2023
కాగా, శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రిషబ్ పంత్ ప్రాణాలతో బయటపడ్డాడు. తీవ్ర గాయాలపాలై హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న పంత్‌కు అనేక రకాల వైద్యపరీక్షలు చేశారు. మెదడు, వెన్నెముక, ఎంఆర్‌ఐ స్కానింగ్ రిపోర్టులు సాధారణంగా వచ్చాయని, ఎలాంటి సమస్య లేదని వైద్యులు అనంతరం వెల్లడించారు. ముఖం, శరీరంపై ఇతర గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించారు. వాపు, నొప్పి ఉండడంతో చీలమండ, మోకీలుకు శనివారం స్కానింగ్ చేశారు.
ప్రస్తుతం పంత్ ఆరోగ్యం స్థిరంగానే ఉందని వైద్యులు తెలిపారు. బీసీసీఐ ఎప్పటికప్పుడు పంత్ ఆరోగ్యం గురించి వాకబు చేస్తోంది. పంత్ కుటుంబ సభ్యులతో వైద్యులతో ఫోన్‌లో వివరాలు అడిగి తెలుసుకుంటోంది. రిషబ్ పంత్‌ను మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి లేదా విదేశాలకు పంపించాలన్న ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం.
మరిన్ని జాతీయ వార్తల కోసం..