Aadhaar-Voter ID Link: బోగస్‌ ఓట్ల ఏరివేతకు కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం.. ఓటర్‌ ఐడీతో ఆధార్‌ నెంబర్‌ లింక్‌!

|

Dec 16, 2021 | 11:02 AM

కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియలో పెద్ద సంస్కరణకు మార్గం సుగమం చేసింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎన్నికల సంస్కరణలకు సంబంధించిన బిల్లుకు ఆమోదం లభించింది.

Aadhaar-Voter ID Link: బోగస్‌ ఓట్ల ఏరివేతకు కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం.. ఓటర్‌ ఐడీతో ఆధార్‌ నెంబర్‌ లింక్‌!
Aadhaar Voter Id Link
Follow us on

Aadhaar-Voter ID Linking: కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియలో పెద్ద సంస్కరణకు మార్గం సుగమం చేసింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎన్నికల సంస్కరణలకు సంబంధించిన బిల్లుకు ఆమోదం లభించింది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. బోగస్‌ ఓట్లను తొలగించేందుకు చేసిన ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపంది. ఒక వ్యక్తికి ఓకే ఓటు ఉండాలన్న నిబంధనకు ఓకే చెప్పేసింది. అటు ఓటర్‌ ఐడీ కార్డుతో ఆధార్‌ నెంబర్‌ను లింక్‌ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.

కీలక సంస్కరణల బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సిఫారసుల మేరకు పలు సంస్కరణలకు ఆమోదముద్ర వేశారు. ఓటర్ల జాబితాను బలోపేతం చేయడం, ఓటింగ్‌ ప్రక్రియను మరింత మెరుగుపరచడం, ఈసీకి మరిన్ని అధికారాలు కల్పించడంతో పాటు బోగస్‌ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా పలు ప్రతిపాదనలతో కూడిన బిల్లుకు ఆమోద ముద్రవేసింది కేంద్ర కేబినెట్‌. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

పాన్-ఆధార్ లింక్ చేసినట్టుగానే, ఓటర్‌ ఐడీతో ఆధార్‌ నంబర్‌ను అనుసంధానం చేయనున్నారు. అయితే వ్యక్తిగత గోప్యతకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి వ్యక్తుల స్వచ్ఛంద ప్రాతిపదికన ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. మరోవైపు కొత్త ఓటర్లుగా నమోదు చేయించుకొనేవారికి ఏడాదిలో నాలుగు సార్లు అవకాశం కల్పించే మరో ప్రతిపాదనకు కూడా కేంద్ర కేబినెట్‌ ఆమోదించింది.

ఇకపై ఏటా జనవరి 1 నాటికి 18 ఏళ్లు దాటితేనే ఓటరుగా నమోదుకు అనుమతించనున్నారు. అలాగే ఏడాదిలో నాలుగుసార్లు తమ ఓటు హక్కును నమోదు చేసుకొనే వెసులుబాటు కల్పించారు. దీనికోసం ఏటా నాలుగు వేర్వేరు కటాఫ్‌ తేదీలు కేటాయిస్తారు. ఇప్పటివరకు ఏడాదిలో ఒక్కసారి మాత్రమే కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం ఉంది. అటు రక్షణ సిబ్బంది ఓటు వేసే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సర్వీసు అధికారుల విషయంలో గతంలో ఉన్న నిబంధనల్ని సడలించింది. దంపతులిద్దరూ ఓటు హక్కు వినియోగించుకొనేలా బిల్లులో మార్పులు చేసింది. ఎన్నికలు నిర్వహించే ప్రాంగణాల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘానికే పూర్తి అధికారాలు అప్పగిస్తూ మరో సవరణ చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఈ సంస్కరణలు కీలకంగా మారనున్నాయి.

Read Also… Milind Naik: ఎన్నికల ముందు బీజేపీకి భారీ షాక్.. లైంగిక ఆరోపణలతో మంత్రి పదవికి రాజీనామా!