దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయింది. ఈ తరుణంలో ఏడాది పాటు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వజ్రోత్సవాలు కూడా జరుపుకున్నాం. కానీ భావి భారత పౌరులు మాత్రం ఇంకా దుర్భర జీవనంలోనే బతుకీడుస్తున్నారు. ఇంకా వీధి దీపాల కిందే తమ భవిష్యత్ కు బాటలు వెతుక్కుంటున్నారు. దేశం అభివృద్ధి చెందుతున్నా పేదల జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. కనీస మౌలిక సదుపాయాలకూ నోచుకోని గ్రామాలు దేశంలో ఇంకా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. కానీ ఈ సంఘటన చూస్తే నిజమే అనిపిస్తుంది. ఓ బాలిక స్కూలు అయిపోయిన తర్వాత ఓ వీధి లైటు కింద కూర్చుని హోం వర్క్ చేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు బాలిక అంకిత భావానికి ఫిదా అవుతున్నారు. ప్రశంసలు కురిపిస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ బాలిక పుట్‌పాత్ పై వీధి లైట్ల వెలుగులో చదువుకుంటోంది. రోడ్డుపై వెళ్లే వాహనాల రణగొణ ధ్వనులు సైతం ఆ బాలిక ఏకాగ్రతను టచ్ చేయలేక పోయాయి. స్కూల్ యూనిఫామ్‌లో ఉన్న ఆ బాలిక ఫుట్‌పాత్‌పై కూర్చొని సీరియస్‌గా రాసుకుంటుంది.
తల్లిదండ్రులు కష్టపడి తమ పిల్లల భవిష్యత్ కోసం అన్ని సౌకర్యాలు కల్పించినా కొందరు విద్యార్థులు చదువు పట్ల నిర్లక్ష్యం వహిస్తారు. అలాంటి వారికి ఈ బాలిక చదువు పట్ల తనకున్న అంకితభావం, శ్రద్ధతో స్పూర్తిగా నిలుస్తోంది. కనీస సౌకర్యాలు కూడా లేని పేద పిల్లలు తమ లక్ష్యాన్ని సాధించేందుకు అందుబాటులో ఉన్న వాటినే తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ఈ బాలిక కూడా ఆ కోవకు చెందినదే అనుకుంటా.. వీధి లైట్ల కాంతి వెలుగులోనే తన భవిష్యత్‌కు బాటలు వేసుకుంటోంది. అటుగా వాహనంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఇది గమనించి తన మొబైల్‌లో దీనిని రికార్డు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ‘నేటి ఉత్తమ వీడియో’ అని దానికి శీర్షిక పెట్టారు. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. చదువు పట్ల ఆ బాలిక శ్రద్ధ, అంకితభావంపై ప్రశంసలు కురిపించారు. ఇలాంటి పిల్లలు తమ భవిష్యత్తుతోపాటు దేశ భవిష్యత్తును ప్రకాశవంతం చేస్తారని కొందరు కామెంట్లు చేయగా, మరికొందరు ఆ బాలికకు దేవుడు అండగా ఉండి, చల్లగా చూడాలని ఆశీర్వదించారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..