కుంభమేళాకు వెళ్లిన అన్న.. ఇక్కడ తమ్ముడి హత్య! పోలీసుల విచారణలో షాకింగ్‌ నిజాలు

సొంత తమ్ముడ్ని చంపేందుకు ఓ అన్న కిరాయి హంతకులకు కాంట్రాక్ట్‌ ఇచ్చాడు. పైగా ఏం ఎరగనట్లు, తన పాపాలు కడిగేసుకుందామని కుంభమేళాకు వెళ్లాడు. కానీ, దేవుడికి తెలియదా ఏ పాపాలు కడగాలో, ఏ పాపాలకు శిక్ష విధించాలో.. కుంభమేళా నుంచి తిరిగి రాగానే పోలీసుల చేతికి చిక్కాడు. సినిమా స్టోరీలా ఉన్నా.. ఇది రియల్‌ క్రైమ్‌ స్టోరీ ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

కుంభమేళాకు వెళ్లిన అన్న.. ఇక్కడ తమ్ముడి హత్య! పోలీసుల విచారణలో షాకింగ్‌ నిజాలు
Karnataka Crime News

Updated on: Feb 17, 2025 | 11:41 AM

తెలియక చేసిన పాపాలు పోతాయని చాలా మంది కుంభమేళాకు వెళ్లి పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. కానీ, ఓ ప్రబుద్ధుడు మాత్రం తెలిసి తెలిసి పెద్ద పాపం చేసి మరీ కుంభమేళాకు వెళ్లాడు. సొంత తమ్ముడినే మట్టుబెట్టాలని ఓ కిరాయి రౌడీలకు కాంట్రాక్ట్‌ ఇచ్చి, ఆ పాపం నుంచి తప్పించుకోవాలని పరమభక్తుడిలా కుంభమేళాకు వెళ్లాడు. కానీ, తిరగొచ్చే సరికి పోలీసులు అతన్ని పాపాన్ని సాక్ష్యాలతో సహా లెక్కగట్టి జైలుకు పంపారు. థ్రిల్లర్‌ సినిమా స్టోరీని మించిన ఈ క్రైమ్‌ రియల్‌గా కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. ఓ అన్న తన సొంత తమ్ముడిని చంపమని కిరాయి హంతకులకు రూ.5 లక్షల రుపాయలు ఇచ్చాడు. డబ్బు తీసుకున్న కసాయిగాళ్లు అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఫిబ్రవరి 11న మాండ్య జిల్లా మద్దూర్ తాలూకాలో కృష్ణే గౌడ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. హత్య కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్య చేసిన వ్యక్తులను పోలీసులు పట్టుకొని విచారణ మొదలుపెట్టారు. ఈ కేసు విచారణలో పోలీసులకు మతిపోయే నిజాలు తెలిశాయి. ఈ హత్యను మృతుడి అన్న తమకు డబ్బులిచ్చి ఈ హత్య చేయించినట్లు నిందితులు పోలీసులకు వెల్లడించారు. హత్యకు గురైన కృష్ణే గౌడ అన్న శివనంజే గౌడ కుంభమేళా నుంచి తిరిగి రాగానే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల స్టైల్లో విచారిస్తే.. శివనంజే నిజాలు కక్కేశాడు. తన తమ్ముడు కృష్ణే గౌడకు ఉన్న అప్పులను తాను తీర్చానని, అందుకు ప్రతిగా తన ఆస్తిని నా భార్య పేరిట రాయాలని కోరినట్లు తెలిపాడు.

అందుకు కృష్ణే గౌడ ఒప్పుకోకుండా తన భార్యను అసభ్యంగా తిట్టేవాడని శివనంజే తెలిపాడు. అందుకే తన తమ్ముడిని చంపమని రూ.5 లక్షలు చంద్రశేఖర్‌, సునీల్‌, ఉల్లాస్‌, ప్రతాప్‌, అభిషేక్‌, శ్రీనివాస్‌, హనుమ గౌడలకు ఇచ్చినట్లు శివనంజే చెప్పినట్లు పోలీసులు తెలిపారు. తమ్ముడిని హత్య చేయాలని రెండు నెలల ముందు నుంచే ప్లాన్‌ చేసిన శివనంజే, ఈ మేరకు సుపారీ గ్యాంగ్‌కు డబ్బులిచ్చి, పథకం ప్రకారం హత్య జరగడానికి ఒక రోజు ముందే ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు వెళ్లిపోయాడు. హత్య కేసు తనపై రావొద్దని శివనంజే కుంభమేళా టూర్‌ వేశాడు. కానీ, కాల్‌ రికార్డ్స్‌ ఆధారంగా పోలీసులు శివనంజేనే ప్రధాన సూత్రధారి అని తేల్చారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.