టెక్నాలజీలో దూసుకుపోతున్నా.. సాంకేతికతతో పోటీ పడుతున్నా.. అందనంత ఎత్తుకు ఎదుగుతున్నా.. ఇంకా కొన్ని ప్రాంతాల్లో మూఢ నమ్మకాలు సజీవంగానే ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చేతబడి గురించి. సమాజంలో తీవ్రంగా వేళ్లూనుకుపోయిన ఈ దురాగతం.. తీవ్ర అలజడులు సృష్టిస్తోంది. మంత్రాలు చేస్తున్నారనే కారణంతో దాడులకు పాల్పడేలా చేస్తోంది. కొన్ని సార్లు హత్యలు చేసేందుకూ వెనకాడటం లేదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఒడిశాలో ఇలాంటి ఘటనే జరిగింది. మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో ఇంటి బయట నిద్రిస్తున్న దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఒడిశాలోని కియోంజర్ జిల్లాలో గుర్తు తెలియని దుండగులు దంపతులను దారుణంగా హత్య చేశారు. చేతబడి చేస్తున్నారనే అనుమానంతో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. దైతరీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రసూల్ ఝుముకిపాటియా సాహి గ్రామంలో ఈ ఘటన జరిగింది.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఒకరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. బహదా ముర్ము, ధని దంపతులు. వీరు శనివారం రాత్రి బయట నిద్రిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో కుమార్తెకు మెలకువ రావడంతో బయటకు వచ్చింది. ఆ సమయంలో తల్లిదండ్రులిద్దరూ రక్తపు మడుగులో పడి ఉండటం చూసి అవాక్కైంది. ఈ విషయాన్ని వెంటనే తన మామ కిషన్ మరాండీకి ఫోన్ చేసి తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రస్తుతం ఈ విషయమై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఆదివారం ఉదయం దైతరీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రసూల్ జుముకిపాటియా సాహి గ్రామంలో భార్యాభర్తల మృతదేహాలు రక్తంలో తడిసి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో, కియోంజర్ పోలీసు సూపరింటెండెంట్ మిత్రభాను మహపాత్ర మాట్లాడుతూ, ఈ హత్యల వెనుక మంత్రవిద్యే కారణమని ప్రాథమికంగా తెలుస్తోందన్నారు. ప్రస్తుతం ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతోందని.. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.