రాజస్థాన్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూతో నెల రోజుల్లో ఏడు వేలకుపైగా పక్షులు మరణించాయి. గత ఏడాది డిసెంబర్ 25 నుంచి జనవరి 25 వరకు 7,187 పక్షులు చనిపోయినట్లు ఆ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ తెలిపింది. మృతి చెందిన పక్షులలో 4,976 కాకులు, 427 నెమళ్ళు, 683 పావురాలు, 1,101 ఇతర పక్షులు ఉన్నాయని పేర్కొంది. రాజస్థాన్‌లోని 17 జిల్లాల్లో ఏవియన్ ఇన్‌ఫ్లూఎంజా (బర్డ్ ఫ్లూ) నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ వివరించింది. అయితే పరిస్థితి అదుపులోనే ఉన్నదని, బర్డ్ ఫ్లూ నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. కాగా… దేశంలోని కేరళ వంటి పలు రాష్ట్రాల్లో సైతం బర్డ్‌ఫ్లూతో పక్షులు అధిక సంఖ్యలో చనిపోతున్నాయి.