
నాలుగు పదులు దాటిన వయసు.. సాదాసీదా చీర.. కాళ్లకు మామూలు స్లిప్పర్లు. ఆమెను చూస్తే రేస్‌లో పాల్గొంటుందని ఎవరూ నమ్మరు. కానీ కూతుళ్ల చదువు కోసం వంట మనిషిగా పనిచేస్తున్న 47 ఏళ్ల రమాబాయి రణ్‌ధీర్.. మారథాన్‌లో పాల్గొని విజయం సాధించి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా అంబాజోగాయికి చెందిన రమాబాయి.. ఇటీవల భారతీయ శిక్షణ ప్రసారక్ సంస్థకు చెందిన విద్యా ప్రాంగణంలో నిర్వహించిన అమృత్ మహోత్సవ్ వేడుకల్లో ‘అమృత్ దౌడ్’ మారథాన్‌లో పాల్గొన్నారు. ఎలాంటి ప్రత్యేక శిక్షణ, ముందస్తు సిద్ధత లేకుండానే.. చివరికి చెప్పులు లేకుండా పరుగెత్తి మొదటి స్థానంలో నిలిచి రూ.3 వేల నగదు బహుమతి గెలుచుకున్నారు.
”ప్రతిరోజూ నా పిల్లల భవిష్యత్తు కోసం పరుగెడుతుంటాను.. కానీ ఈ రోజు నా కోసం పరుగెత్తాను” అని రమాబాయి చెప్పారు. రమాబాయికి ఇద్దరు కూతుళ్లు. ఒకరు బీఎస్సీ చదువుతుండగా.. మరో కూతురు పోలీస్ రిక్రూట్‌మెంట్‌కు సిద్ధమవుతోంది. వారిని చదివించేందుకు హింగోలీ నుంచి అంబాజోగాయికి వచ్చిన ఆమె.. భర్త మరణించిన తర్వాత కుటుంబాన్ని పోషిస్తూ, పిల్లల చదువుకు అవసరమైన డబ్బు కోసం ఓ అకాడమీలో వంట మనిషిగా పనిచేస్తున్నారు.
కూతుళ్ల భవిష్యత్తు కోసం నిరంతరం కష్టపడుతున్న రమాబాయి.. ఇప్పుడు మారథాన్‌లోనూ తన సత్తా చాటారు. ఆమె విజయం చూసి అక్కడున్న వారంతా భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం అన్ని వర్గాల నుంచి ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.