దుబాయ్‌ నుంచి వచ్చి భార్యను చంపి.. ఆపై ఉరేసుకుని భర్త సూసైడ్‌!

బతుకుదెరువు కోసం కోటి ఆశలతో దుబాయ్‌ వెళ్లాడో వ్యక్తి. దుబాయ్‌లోనే మేస్త్రీగా పనిచేస్తున్నాడు. ఇక సొంతూరిలో ఉన్న అతడి భార్య ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఇంతలో ఏం జరిగిందో తెలియదుగానీ.. దుబాయ్‌ నుంచి హఠాత్తుగా అతడు భారత్‌కు వచ్చాడు. వచ్చీరావడంతోనే భార్యను కత్తితో పొడిచి దారుణంగా చంపేశాడు. అనంతరం తన ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణం తీసుకున్నాడు. అంతుచిక్కని మిస్టరీ మారిన ఈ భార్యభర్తల మరణం కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆదివారం (సెప్టెంబర్‌ 28) కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే..

దుబాయ్‌ నుంచి వచ్చి భార్యను చంపి.. ఆపై ఉరేసుకుని భర్త సూసైడ్‌!
Man Kills Wife Then Dies By Suicide

Updated on: Sep 29, 2025 | 9:11 PM

బెంగళూరు, సెప్టెంబర్‌ 29: బెంగళూరుకు చెందిన ధర్మశీలం (30) అనే వ్యక్తి, మంజు (27) అనే యువతితో 2022 సెప్టెంబర్‌లో వివాహం జరిగింది. వివాహం జరిగి మూడేళ్లు అవుతున్నా వీరికి సంతానం లేదు. వివాహం అనంతరం ధర్మశీలం బతుకుదెరువు కోసం దుబాయ్‌కి వెళ్లి అక్కడే మేస్త్రీగా పనిచేస్తున్నాడు. ఇక బెంళూరులోనే ఉన్న భార్య మంజు తన తండ్రి పెరియస్వామితో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది.

ఏం జరిగిందో తెలియదుగానీ ఇటీవల ధర్మశీలం దుబాయ్‌ నుంచి ఉన్నపలంగా బెంగళూరుకు తిరిగొచ్చాడు. ఆదివారం రాత్రి మామ పెరియస్వామి బయటికి వెళ్లడం చూసిన ధర్మశీలం.. తన భార్య మంజును కత్తితో పొడిచి దారుణంగా చంపేశాడు. ఆపై అతను కూడా ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి 9.30 గంటల సమయంలో ఇంటికి తిరిగొచ్చిన పెరియస్వామి ఇంటి తలుపులు తీసి, అక్కడి దృశ్యం చూసి షాకయ్యాడు. ఓ వైపు రక్తం మడుగులో కూతురు, మరోవైపు ఉరికొయ్యకు వేలాడుతున్న అల్లుడిని చూసి కుప్పకూలిపోయాడు.

సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. మంజు కత్తిపోటు గాయాలతో మంచం మీద పడి ఉండగా, ధర్మశీలం నైలాన్ తాడుతో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ ఉండటం పోలీసులు గమనించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ధర్మశీలం ఇలాంటి కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడనే విషయం దర్యాప్తులో తేలుతుందని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.