Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది ఆంధ్రప్రదేశ్ వాసుల దుర్మరణం.. దసరా పండుగకు వచ్చి వెళ్తుండగా..

Chikkaballapur Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిక్‌బళ్లాపూర్‌ దగ్గర కారు.. ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లా వాసులుగా గుర్తించారు.

Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది ఆంధ్రప్రదేశ్ వాసుల దుర్మరణం.. దసరా పండుగకు వచ్చి వెళ్తుండగా..
Road Accident

Updated on: Oct 26, 2023 | 10:08 AM

Chikkaballapur Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిక్‌బళ్లాపూర్‌ దగ్గర ఓ టాటా సుమో కారు.. ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లా గోరంట్లకు చెందిన వారిగా గుర్తించారు. గురువారం తెల్లవారుజామున చిక్కబళ్లాపుర శివార్లలోని మొబైల్ పోలీస్ స్టేషన్ ఎదుట ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని టాటా సుమో ఢీకొట్టింది. దీంతో టాటా సుమోలో ఉన్న 12 మంది చనిపోయారు. బెంగళూరు సమీపంలోని చిక్కబళ్లాపూర్ శివార్లలో బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారి-44పై ఉన్న ట్రక్కును ఎస్‌యూవీ ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

తెల్లవారుజామున పొగమంచు బాగా ఉండటంతో.. డ్రైవర్ లారీని గమనించి ఉండకపోవచ్చని, దీంతో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని చిక్కబళ్లాపూర్ ఎస్పీ డీఎల్‌నగేష్ తెలిపారు. మరణించిన వారిలో ఓ చిన్నారి, ముగ్గురు మహిళలు, 9 మంది పురుషులు ఉన్నారు. మృతులు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నారని సంఘటనా స్థలాన్ని సందర్శించిన ఎస్పీ చెప్పారు. ఓ మహిళ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిక్కబళ్లాపూర్‌ పోలీస్‌ సూపరింటెండెంట్‌ డీఎల్‌ నగేశ్‌ తెలిపారు.

మృతులు ఆంధ్రప్రదేశ్‌లోని గోరంట్లకు చెందినవారని, బెంగళూరులోని హొంగసంద్రలో నివసిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు.

దసరా పండుగకు సొంతూరికి వచ్చి మళ్లీ బెంగళూరుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..