
నిర్మాణం, అభివృద్ధి పేరుతో చెట్ల నరికివేత కొనసాగుతున్న వేళ.. ఓ వ్యక్తి మాత్రం తనదైన శైలిలో పచ్చదనాన్ని పెంచేందుకు చేస్తున్న ప్రయత్నం సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది. రైలులో ప్రయాణిస్తూ దారిపొడవునా విత్తనాలు చల్లుతున్న ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
‘డౌన్ టు ఎర్త్’ కథనం ప్రకారం, 2023 జూలై నుంచి 2026 మే మధ్యకాలంలో దేశవ్యాప్తంగా సుమారు 28 లక్షల చెట్లను నరికేందుకు అనుమతులు ఇవ్వడం, చెట్లను తొలగించినట్లు సమాచారం. రహదారుల విస్తరణ, భవన నిర్మాణాలు, ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భారీగా చెట్లను తొలగిస్తున్న నేపథ్యంలో.. పచ్చదనాన్ని తిరిగి పెంచాల్సిన అవసరంపై చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో వేత వల్లి అనే యూజర్ సోషల్ మీడియా Xలో షేర్ చేసిన వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. వర్షాకాలంలో ఓ వ్యక్తి రైలు ప్రయాణాన్ని సైతం మొక్కల పెంపకానికి ఉపయోగించుకుంటున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. రైలు డోర్ దగ్గర కూర్చున్న అతని చుట్టూ విత్తనాలు ఉన్నాయి. ప్రయాణిస్తున్న సమయంలో వాటిని ఒక్కొక్కటిగా బయటకు విసురుతూ వెళ్తున్నాడు.
రైళ్లు సాధారణంగా పట్టణాలతో పాటు మారుమూల ప్రాంతాలు, ఖాళీ ప్రదేశాల గుండా ప్రయాణిస్తుంటాయి. దీంతో ఒకే ప్రయాణంలో పెద్ద విస్తీర్ణంలో విత్తనాలను చల్లవచ్చన్నది అతని ఆలోచనగా కనిపిస్తోంది. వర్షాకాలంలో విత్తనాలు చల్లడం వల్ల సహజంగా తేమ అందడంతో కొన్ని విత్తనాలు మొలకెత్తే అవకాశం ఉంటుంది. ఈ వీడియోపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. చెట్లను నరికే వార్తల మధ్య ఇలాంటి ప్రయత్నాలు ఆశను కలిగిస్తున్నాయని పలువురు ప్రశంసించారు. ఓ నెటిజన్.. ‘‘మేమూ విసురుతాం.. కానీ విత్తనాలు కాదు, చెత్త’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. మరికొందరు అభివృద్ధి పేరుతో చెట్ల నరికివేతపై ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే కేవలం విత్తనాలు చల్లడం మాత్రమే మొక్క పెరగడానికి సరిపోదు. ప్రతి విత్తనానికి నేల, తేమ, వెలుతురు వంటి భిన్నమైన పరిస్థితులు అవసరం. కొన్ని చిన్న విత్తనాలకు పలుచటి మట్టి పొర చాలు. మరికొన్ని పెద్ద విత్తనాలను వాటి పరిమాణానికి తగిన లోతులో నాటాలి. అందువల్ల శాస్త్రీయ పద్ధతుల్లో విత్తనాలను నాటడం, మొలకెత్తిన మొక్కలను సంరక్షించడం కూడా అంతే ముఖ్యమంటున్నారు వృక్ష శాస్త్ర నిపుణులు.
చెట్లను నరికివేయడం సులభమే.. కానీ ఒక చెట్టు పెరగడానికి సంవత్సరాలు పడతాయి. అందుకే ఈ వ్యక్తి చేస్తున్న చిన్న ప్రయత్నం పచ్చదనం ప్రాధాన్యాన్ని మరోసారి గుర్తుచేస్తోంది.
వీడియోను ఇక్కడ చూడండి..
மழைக்காலத்தில், ரயில் பாதையோரங்களில் உள்ள திறந்தவெளிகளில் பழங்களின் விதைகள் விதைக்கின்றார் இந்த நல்ல மனிதர். இது ஒரு சிறந்த, பாராட்டுக்குரிய முன்னெடுப்பு;
வாய்ப்பு கிடைக்கும்போதெல்லாம் நாமும் இதைப் பின்பற்ற வேண்டும். pic.twitter.com/munqmOH7nh
— vetha valli (@vethavalli71231) August 11, 2026
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..