
శరీరంలో తలెత్తే ఏ చిన్న మార్పునైనా మన మూత్రం రంగు ద్వారా గుర్తించవచ్చు. చాలా సందర్భాల్లో మూత్రం పసుపు రంగులో వస్తే అది మధుమేహం లక్షణమని చాలామంది ఆందోళన చెందుతుంటారు. మన శరీరం వైరస్ లేదా బ్యాక్టీరియాలతో పోరాడుతున్నప్పుడు లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మూత్రం రంగు మారడం సహజం.
నీరు తక్కువగా తాగడం వల్ల మూత్రం పసుపు రంగులోకి మారడం ప్రధాన కారణం. శరీరంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్ ఏర్పడినప్పుడు మూత్రం ముదురు రంగులో వస్తుంది. అలాగే ఏదైనా అనారోగ్యం కోసం మందులు వాడుతున్నా లేదా విటమిన్ సప్లిమెంట్స్ తీసుకుంటున్నా మూత్రం రంగు మారే అవకాశం ఉంది. ఇవి సాధారణ కారణాలే తప్ప వీటికి డయాబెటిస్‌తో సంబంధం ఉండకపోవచ్చని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. అయితే రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగినప్పుడు శరీరం ఆ అదనపు చక్కెరను బయటకు పంపడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో శరీరం నుండి ఎక్కువ నీరు బయటకు వెళ్లిపోయి డీహైడ్రేషన్ వల్ల మూత్రం ముదురు పసుపు రంగులోకి మారవచ్చు.
టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో లక్షణాలు కేవలం మూత్రం రంగుతోనే ముగిసిపోవు. తరచుగా మూత్రవిసర్జనకు వెళ్లడం, విపరీతమైన దాహం వేయడం, ఆహారం తిన్న తర్వాత కూడా నీరసంగా అనిపించడం వంటివి ప్రధాన లక్షణాలు. రాత్రి సమయాల్లో ఎక్కువసార్లు నిద్రలేచి మూత్రానికి వెళ్లడం, కారణం లేకుండానే బరువు తగ్గడం లేదా పెరగడం, గాయాలు త్వరగా మానకపోవడం, కంటి చూపు మసకబారడం, పాదాల్లో తిమ్మిర్లు రావడం వంటి సంకేతాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి. ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మంచిది.
మధుమేహాన్ని ఖచ్చితంగా గుర్తించడానికి Hba1C పరీక్ష అత్యంత ప్రాధాన్యత కలిగినది. ఇది గత మూడు నెలల సగటు చక్కెర స్థాయిలను తెలియజేస్తుంది. ఒకవేళ ఈ రీడింగ్ 7.5 శాతం లోపు ఉంటే సరైన జీవనశైలి మార్పుల ద్వారా మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవచ్చు. ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ వైట్ రైస్, బేకరీ ఫుడ్, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ప్రోటీన్ మరియు ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు. కుటుంబంలో మధుమేహం చరిత్ర ఉన్నవారు లేదా 35 ఏళ్లు దాటిన వారు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరం. ముందస్తు గుర్తింపుతోనే ఈ వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటిస్తూ చైతన్యవంతంగా ఉండాలి. పరిశుభ్రతను పాటిస్తూ సమయానికి తగినంత నీరు తాగుతూ ఉండాలి.