Sneezing Facts: తుమ్మును బలవంతంగా ఆపడం ప్రాణాంతకమా? ఇది మస్ట్‌గా తెలుసుకోండి

Sneezing Facts: నలుగురిలో ఉన్నప్పుడు తుమ్ము వస్తే ఎదుటి వారికి ఇబ్బంది కలుగుతుందని మనం తీవ్ర అసౌకర్యానికి గురవుతూ ఉంటాము. అందుకే ముక్కు, నోటిని గట్టిగా మూసుకుని తుమ్మును బలవంతంగా ఆపేందుకు ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ ఇలా చేయడం కొన్ని సందర్భాల్లో ప్రాణాల మీదకు తెచ్చే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Sneezing Facts: తుమ్మును బలవంతంగా ఆపడం ప్రాణాంతకమా? ఇది మస్ట్‌గా తెలుసుకోండి
Sneeze Facts
Image Credit source: Pexels

Updated on: Jul 13, 2026 | 7:31 PM

తుమ్ము అనేది శరీరం తన శ్వాసనాళాల్లోని దుమ్ము, వైరస్‌లు, అలెర్జీ కారకాలను బయటకు పంపే సహజ రక్షణ చర్య. అయితే, మనలో చాలామంది నలుగురిలో ఉన్నప్పుడు తుమ్ములు వస్తే ముక్కు, నోరు గట్టిగా మూసుకుని దాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ వైద్య నిపుణుల ప్రకారం ఇలా బలవంతంగా తుమ్మును ఆపేందుకు ప్రయత్నించడం కొన్ని సందర్భాల్లో ప్రాణాల మీదకు తెచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఇటీవల మెడికల్ జర్నల్‌లో నమోదైన ఒక వింత కేసు దీనికి ఉదాహరణగా నిలిచింది. స్కాట్కాలండ్‌కు చెందిన ఓ వ్యక్తి కారు నడుపుతున్న సమయంలో తుమ్ము రావడంతో ఆ వ్యక్తి ముక్కు, నోరు మూసుకుని తుమ్మును బలవంతంగా ఆపాడు. వెంటనే అతనికి గొంతులో తీవ్రమైన నొప్పి, మెడ వాపు వచ్చాయి. ఆసుపత్రిలో పరీక్షించగా అతని గాలి గొట్టం (ట్రాకియా)లో చిన్న రంధ్రం ఏర్పడినట్లు వైద్యులు గుర్తించారు. ఒత్తిడి కారణంగా ఊపిరితిత్తులోని గాలి చర్మం కిందకు చేరి ‘సర్జికల్ ఎంఫిసిమా’ అనే పరిస్థితి ఏర్పడింది. అదృష్టవశాత్తూ శస్త్రచికిత్స అవసరం లేకుండా కొన్ని వారాల చికిత్స, విశ్రాంతితో కోలుకున్నాడు.

తుమ్మును బలవంతంగా ఆపుకుంటే జరిగే నష్టాలు..

వైద్యుల ప్రకారం సాధారణంగా తుమ్మినప్పుడు ఏర్పడే ఒత్తిడి సహజంగానే బయటకు విడుదల అవుతుంది. కానీ ముక్కు, నోరు పూర్తిగా మూసి తుమ్మును ఆపితే ఆ ఒత్తిడి ఒక్కసారిగా అనేక రెట్లు (10 నుంచి 20 రెట్లు) పెరిగే ప్రమాదముంది. తద్వారా శ్వాసనాళాలు, చెవులు లేదా ఇతర సున్నితమైన భాగాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

అంతేకాదు, కొన్ని సందర్భాల్లో చెవిపొర దెబ్బతినడం, కళ్లలోని చిన్న రక్తనాళాలు పగలడం, తీవ్రమైన తలనొప్పి వంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో స్పృహ తప్పి పడిపోయే అవకాశం కూడా ఉంది. అయితే ఇలాంటి తీవ్రమైన సమస్యలు చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తాయి.

శ్వాసవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా?

శ్వాసవ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే ధూమపానానికి దూరంగా ఉండటం, రోజూ శ్వాస వ్యాయామాలు చేయడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం మంచిది. నలుగురిలో ఉన్నప్పుడు ఎదుటి వారికి ఇబ్బంది కలుగుతుందనో.. లేక మరే ఇతర కారణం చేతనో తన ముక్కు, నోరు గట్టిగా మూసుకుని తుమ్మును ఆపడానికి ప్రయత్నించడం ఏ మాత్రం సరికాదు. తుమ్మును బలవంతంగా ఆపకుండా టిష్యూ లేదా రుమాలు ఉపయోగించడం లేదా మోచేతిని అడ్డం పెట్టుకుని తుమ్మడం ఉత్తమం. సహజ శరీర ప్రక్రియలను బలవంతంగా అణచివేయకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

Also Read: రోజూ కొద్దిగా మద్యం తాగితే గుండెకు మంచిదా? కొత్త అధ్యయనంలో తేలింది ఇదే..

Loading...
Unable to load recommendations.
Follow Us