
దక్షిణాది వంటకంగా ప్రయాణం మొదలుపెట్టి, దేశవ్యాప్తంగా ఎంతో మందికి ఇష్టమైన అల్పాహారంగా మారింది దోశ. వేడివేడిగా లభించే స్ట్రీట్ ఫుడ్ నుంచి కార్పొరేట్ హోటళ్ల వరకు దోశకు ఉండే క్రేజే వేరు. అయితే చాలా మంది ఇళ్లలో దోశలు వేస్తుంటారు. దోసె పిండిని పెనంపై పోసే ముందు, చాలామంది కొన్ని నీటి చుక్కలను పెనంపై చల్లడం మీరు గమనించే ఉంటారు. అసలు అలా ఎందుకు చేస్తారు? అనే డౌట్ చాలా మందికి వస్తుంటుంది. ప్రముఖ డైటీషియన్ డాక్టర్ అమ్రీన్ షేక్ అందించిన వివరాల ప్రకారం.. వంట చేయడానికి పెనం సరైన ఉష్ణోగ్రతలో ఉందో లేదో తనిఖీ చేయడానికి ఈ నీటిని చల్లడం ఒక సాంప్రదాయ పద్ధతి. పెనంపై నీరు ప్రతిస్పందించే తీరు దాని ఉపరితల ఉష్ణోగ్రత ఎంత ఉందనేది స్పష్టంగా తెలియజేస్తుంది.
ఉష్ణోగ్రత అంచనా: వేడిగా ఉన్న పెనంపై నీరు వేయగానే త్వరగా ఆరిపోతే, పెనం బాగా వేడిగా ఉందని అర్థం.
పిండి సమానంగా పరచడానికి: పెనం అతిగా వేడెక్కితే, పిండిని పలుచని పొరగా పరచక ముందే అది వెంటనే గట్టిపడిపోతుంది. అందుకే కొన్ని నీటి చుక్కలు చల్లి ఆ వేడిని కొద్దిగా తగ్గించి, పిండిని పెనంపై సులభంగా, సమానంగా పరచడానికి ఇది సహాయపడుతుంది.
క్రిస్పీనెస్: దోశ పిండి ఉడకడానికి సరైన మోతాదులో వేడి, తేమ అవసరం. పెనం ఉష్ణోగ్రత సరిగ్గా ఉంటేనే దోసె చక్కగా ఉడికి, మంచి రంగుతో పాటు కరకరలాడుతూ వస్తుంది. పెనం మరీ చల్లగా ఉంటే దోశ మెత్తగా, చప్పగా మారుతుంది.
వేడిగా ఉన్న పెనంపై నేరుగా నీళ్లు చల్లేటప్పుడు కొన్ని సేఫ్టీ చర్యలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కాలిన గాయాల ప్రమాదం: బాగా వేడెక్కిన పెనంపై ఒక్కసారిగా నీళ్లు పోస్తే అవి ఆవిరి రూపంలో లేదా నీటి బిందువులు ఎగిరి చేతులు, ముఖంపై పడే ప్రమాదం ఉంది. అందుకే నేరుగా పోయకుండా కేవలం కొన్ని చుక్కల నీటిని మాత్రమే చిలకరించాలి.
పెనం దెబ్బతినకుండా: నాన్-స్టిక్ ప్యాన్లపై ఉష్ణోగ్రత ఒక్కసారిగా మారితే దాని కోటింగ్ దెబ్బతింటుంది. అలాగే ఇనుప పెనాలు కూడా ఉష్ణోగ్రతలో అకస్మాత్తుగా వచ్చే మార్పుల వల్ల పగిలిపోయే అవకాశం ఉంటుంది. వంట పూర్తయిన వెంటనే పెనంపై నీళ్లు పోయకుండా, దాన్ని సహజంగా చల్లారనివ్వాలి.
దోశ వేయడానికి పెనం ఉరితల ఉష్ణోగ్రత సుమారు 180-200°C మధ్య ఉండాలి. ఇనుప పెనం వేడిని బాగా నిలుపుకొని చక్కటి క్రిస్పీ దోశలను ఇస్తుంది. అయితే కొత్తగా వంట నేర్చుకునేవారికి నాన్-స్టిక్ ప్యాన్లు సౌకర్యంగా ఉంటాయి. ప్యాన్ ఏదైనా సరే, ఉష్ణోగ్రతను సరిగ్గా నియంత్రించడం వల్లే రుచికరమైన, పరిపూర్ణమైన దోసె తయారవుతుంది.