
సాధారణంగా ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు జనాలు ఏసీలను ఎక్కువగా వాడుతున్నారు. కానీ పగటిపూట తీవ్రమైన ఎండలు, రాత్రిపూట కూడా వేడి వాతావరణం ఉండటం వల్ల ఏసీలు ఉన్నప్పటికీ శరీరం తన ఉష్ణోగ్రతను నియంత్రిచ లేకపోతోందని నిపుణులు చెబుతున్నారు. గది ఉష్ణోగ్రత ఒక్కసారిగా చల్లబరచడం, రూమ్‌లో గాలి సరిగ్గా ఆడపోవడం కూడా ఇందుకు కారణం అని చెబుతున్నారు. దీనిపై ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ పల్మనాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రవి కుమార్ మాట్లాడుతూ.. ఇటీవల ఏసీల్లో పడుకున్నా నిద్ర సరిగ్గా పట్టడం లేదనే ఫిర్యాదులు చాలా ఎక్కువయ్యాయని తెలిపారు. మనం ప్రశాంతంగా నిద్రపోవాలంటే రాత్రి సమయంలో మన శరీర అంతర్గత ఉష్ణోగ్రత కొద్దిగా తగ్గాలని. కానీ, పగలు రాత్రి తేడా లేకుండా నిరంతరం వేడి వాతావరణం ఉండటం వల్ల శరీరం తన ఉష్ణోగ్రతను తగ్గించుకోలేకపోతుందన్నారు. దీనివల్ల నిద్ర పదే పదే చెడిపోతుందన్నారు.
యూఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ పరిశోధనల ప్రకారం.. మన చుట్టూ ఉన్న వాతావరణం వేడిగా ఉంటే నిద్ర నాణ్యత దెబ్బతినడంతో పాటు, పదే పదే మెలకువ కావడం, విపరీతంగా చెమటలు పట్టడం, ఉదయం లేవగానే తలనొప్పిగా ఉండటం, రోజంతా అలసట, చిరాకు, ఏకాగ్రత లోపించడం జరుగుతుందని తేలిందన్నారు. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారిలో ఈ ఇబ్బందులు మరింత తీవ్రమవుతున్నాయని పరిశోదన పేర్కొందన్నారు. తీవ్రమైన వేడి, డీహైడ్రేషన్ వల్ల శ్వాసనాళాల్లో మంట రావచ్చని.. అలాగే ఏసీ వల్ల గదిలోని గాలి మరీ పొడిగా మారిపోవడం చేత గొంతు ఎండిపోవడం, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు కూడా ఎదురవుతాయని తేలింది. ఇది గుండె, శ్వాసకోశ వ్యాధుల తీవ్రతను పెంచుతుందని పరిశోదన హెచ్చరిస్తోందన్నారు.
ఏసీ టెంపరేచర్‌ను బాగా తగ్గించేస్తే వచ్చే ముప్పు
చాలా మంది పగటిపూట ఎండలో తిరిగి వచ్చి, ఇంటికి రాగానే ఏసీ టెంపరేచర్‌ను బాగా తగ్గించేస్తుంటారు . కానీ, ఇలా ఒక్కసారిగా ఉష్ణోగ్రత మారడం వల్ల నిద్ర మరింత చెడిపోతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. హఠాత్తుగా వాతావరణం చల్లబడటం వల్ల శ్వాసనాళాల్లో ఇబ్బంది, కండరాల నొప్పులు వస్తాయని. నిద్రపోవడానికి చల్లటి వాతావరణం అవసరమే అయినప్పటికీ, మరీ విపరీతమైన చలి లేదా స్థిరంగా లేని ఉష్ణోగ్రతలు నిద్రకు భంగం కలిగిస్తాయన్నారు. అందుకే ఏసీని మరీ తక్కువలో కాకుండా ఒక మోస్తరు టెంపరేచర్‌లో ఉంచడం మంచిదని చెబుతున్నారు.
ఎండ కాలంలో మంచి నిద్ర కోసం వైద్యుల సూచనలు
కేవలం ఏసీల మీదే ఆధారపడకుండా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం, గదిలో గాలి ఆడేలా చూసుకోవడం ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. ఇందుకోసం రోజంతా తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలన్నారు. అలాగే పడుకునే ముందు కాఫీ, టీలకు దూరంగా ఉండాలని. రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయకూడదన్నారు. రోజూ ఒకే టైంకు పడుకోవాలని.. గదిలో కేవలం ఏసీ మాత్రమే కాకుండా గాలి బాగా పరఫరా ఉండేలా చూసుకోవాలన్నారు.
వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి?
ఎండల వల్ల అప్పుడప్పుడు నిద్ర పట్టకపోవడం సహజమే. కానీ, నిరంతరాయంగా నిద్రలేమి వేధిస్తున్నా, విపరీతమైన గురక వస్తున్నా, పగటిపూట విపరీతంగా నిద్ర వస్తున్నా లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. ఎందుకంటే ఎండ తీవ్రత వల్ల అంతకుముందు మీలో బయటపడని స్లీప్ అప్నియా లేదా శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలు బయటపడే అవకాశం ఉంది. ఎండలు రోజురోజుకూ ముదురుతున్న నేపథ్యంలో నిద్ర నాణ్యతపై దృష్టి పెట్టడం చాలా అవసరమన్నారు
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.