
మన పెద్దలు “అతి సర్వత్ర వర్జయేత్” అని చెప్పిన మాటకు జీవితంలో ఎంతో లోతైన అర్థం ఉంది. ఏ విషయం అయినా పరిమితి దాటితే అది మంచికంటే చెడే ఎక్కువ చేస్తుందని దీని అర్థం. అంటే అతి చేస్తే అమృతం కూడా విషంగా మారుతుంది. ప్రేమ, అనుబంధాలు, ఆప్యాయతలు, కోపతాపాలు.. ఇవన్నీ మన జీవితాన్ని ఎంతో అందంగా.. మధురంగా మార్చేవే. అయితే వీటిలో ఏది హద్దులు దాటినా.. చివరకు మనకు బాధలనే మిగుల్చుతాయి.
ప్రేమ అనేది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భావన. ప్రేమతో అసాధ్యాన్ని కూడా సాధ్యం చేయవచ్చు. అయితే ప్రేమకు కూడా ఒక పరిమితి ఉండాలి. వంట రుచిగా ఉండాలంటే అందులో ఉప్పు వేయడం ఎంతో అవసరం. అదే ఉప్పు ఎక్కువైతే ఆ వంటను తినడం సాధ్యంకాదు. బంధాల్లో ప్రేమ కూడా అంతే. ప్రేమ సరైన హద్దుల్లో ఉంటేనే మంచిది. స్నేహం, కుటుంబ సంబంధాలు, ఇతర అనుబంధాల్లో అతి ప్రేమ చూపించడం కొన్నిసార్లు ఎదుటివారిని పూర్తిగా మనపై ఆధారపడేలా చేస్తుంది. అదే సమయంలో, ఆ వ్యక్తి దూరమైతే మానసికంగా తీవ్ర బాధను ఎదుర్కోవాల్సి వస్తుంది.
చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులు, పెద్దలు పిల్లలను అతిగా గారాబం చేస్తూ పెంచుతుంటారు. వారు అడగకముందే అన్నీ సమకూర్చడం, వారికి సంబంధించిన ప్రతి చిన్న నిర్ణయాన్ని కూడా తల్లిదండ్రులే తీసుకోవడం వల్ల పిల్లలు స్వతంత్రంగా ఆలోచించే సామర్థ్యాన్ని కోల్పోతారు. ప్రత్యేకంగా కొందరు అమ్మాయిలు తల్లిదండ్రుల ప్రేమకు బాగా అలవాటు పడటం వల్ల పెళ్లి తర్వాత కొత్త వాతావరణానికి అలవాటు పడటంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే కొడుకులను అతిగా గారాబం చేయడం వల్ల భవిష్యత్తులో కుటుంబ జీవితంతో ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా భార్యాభర్తల సంబంధాలపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
ప్రేమను చూపించకూడదని కాదు.. కానీ అది ఆరోగ్యకరమైన పరిమితిలో ఉండాలి. ప్రతి వ్యక్తికి స్వతంత్రత, వ్యక్తిగత పరిమితులు, నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉండాలి. ప్రేమ పేరుతో వారిని పూర్తిగా మనపై ఆధారపడేలా చేయడం మంచిది కాదు.
ప్రేమ మితిమీరితే ఎలా ఇబ్బందులు వస్తాయో, కోపం కూడా కట్టలు తెంచుకుంటే జీవితాన్ని నాశనం చేస్తుంది. ప్రతి ఒక్కరికీ కోపం రావడం సహజమే. కానీ ఆ కోపాన్ని మనసులోనే దాచుకుంటూ ఉండటం లేదా తీవ్రంగా ప్రదర్శించడం వల్ల సంబంధాలు దెబ్బతింటాయి. కోపం అనేది నెమ్మదిగా మన మనశ్శాంతిని హరించే విషంలాంటిది. ఒక క్షణిక ఆవేశం ఎన్నో సంవత్సరాల బంధాలను కూడా దూరం చేయగలదు. అందుకే కోపాన్ని నియంత్రించుకోవడాన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి.
జీవితంలో ప్రేమ, కోపం రెండూ అవసరమే. కానీ వాటిని ఎలా వ్యక్తపరుస్తామన్నదే ముఖ్యమైనది. మితిమీరిన ప్రేమ చివరకు చేటు చేస్తే, మితిమీరిన కోపం ఒంటరితనానికి కారణమవుతుంది. ప్రేమను చూపించడం తప్పుకాదు.. కానీ హద్దులు దాటకుండా చూడాలి. కోపం రావచ్చు.. కానీ అది బంధాలను దెబ్బతీయకుండా చూసుకోవాలి. ప్రేమ, కోపాల సమతుల్య భావోద్వేగాలే ఆరోగ్యకరమైన సంబంధాలకు, ప్రశాంతమైన జీవితానికి అసలైన నిచ్చెనలా నిలుస్తుంది.