
విదురుడు మహాభారతంలో అత్యంత ప్రత్యేకమైన వ్యక్తిగా నిలిచాడు. తన ధర్మం, జ్ఞానం, ధైర్యంతో రాజసభలో గౌరవాన్ని పొందాడు. రాజు, యువరాజులతో సమానంగా చర్చలు జరిపే స్థాయికి ఎదిగాడు. ఆయన భక్తి, నిజాయితీ, స్వచ్ఛమైన ఆలోచనలు రాజధానిలో అందరికీ ఆదర్శంగా నిలిచాయి. విదురుడు ఎప్పుడూ ధర్మాన్ని అనుసరించాడు. అధికారం, సంబంధాలు, స్వప్రయోజనాల కన్నా ధర్మాన్ని గొప్పగా పరిగణించాడు. ఎంత క్లిష్ట పరిస్థితుల్లోనైనా ధర్మాన్ని విడిచిపెట్టలేదు. ఇది ఆయన నిజమైన మహానుభావుడిగా నిలిపింది.
విదురుడి మాటల ప్రకారం ఉత్తమ వ్యక్తి ఎవరిని అయినా హానిచేయాలనుకోడు. అందరి మేలే కోరుకుంటాడు. ఎవరి దుఃఖాన్ని కూడా ఆశించడు. అలాంటి మనిషి సమాజం కోసం త్యాగాలు చేస్తాడు. తనకేమీ లాభం లేకపోయినా ఇతరులకు ఉపయోగపడే పని చేస్తాడు. అలాంటి వ్యక్తి నిస్వార్థ సేవ చేసి ఆదర్శంగా నిలుస్తాడు.
సత్యం మాట్లాడే వ్యక్తి గురించి విదురుడు ప్రత్యేకంగా చెప్పాడు. అలాంటి వ్యక్తి ఎప్పుడు నిజం మాట్లాడతాడు. అబద్ధం చెప్పటం వల్ల తాత్కాలికంగా లాభం కలుగుతుంది కానీ దీర్ఘకాలంగా అది నష్టమే. నిజం మాట్లాడే వ్యక్తిని అందరూ నమ్ముతారు. అతనిపై విశ్వాసం పెరుగుతుంది. అలాంటి వ్యక్తి తన ప్రవర్తనతో సమాజాన్ని ప్రభావితం చేయగలడు.
ఇంద్రియాలను జయించిన వ్యక్తి గురించి విదురుడు ఎంతో గౌరవంతో చెప్పాడు. హృదయం మృదువుగా ఉండాలి. కోపం, అసూయ, హింస వంటి చెడు లక్షణాలను వదిలివేయాలి. దయతో కూడిన మనసు ఉండాలి. అలాంటి వ్యక్తి ఇతరుల పట్ల ప్రేమతో ప్రవర్తిస్తాడు. స్వీయ నియంత్రణ కలిగినవాడు ఎప్పుడూ తప్పులు చేయడు. స్వీయ నియంత్రణ ఉన్న వారి వ్యవహారం ఇతరులకు మార్గదర్శకంగా మారుతుంది.
ఇప్పటి యుగంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలు, ఒత్తిడి, అస్థిరతకు ఎదురుగానే విదుర నీతి ఒక శక్తివంతమైన మార్గదర్శకంగా నిలుస్తోంది. ఇప్పటి జీవిత పరిస్థితులకు నిజాయితీ, నిస్వార్థత, స్వీయ నియంత్రణ వంటి విలువలు ఎంతగానో అవసరం. మనం జీవితంలో ఎంత ఎదిగినా.. మన వ్యక్తిత్వాన్ని బలోపేతం చేయాలంటే విదుర నీతి లాంటి విలువలను ఆచరించాల్సిందే.
విదుర నీతి ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. మనం గొప్ప వ్యక్తి కావాలంటే సంపద, పదవులు అవసరం కాదు. మంచి గుణాలు, నిస్వార్థ జీవనం, ధర్మాన్ని పాటించడమే సరిపోతుంది.