
ఈ రోజుల్లో జ్వరాన్ని కొలవడానికి డిజిటల్ థర్మామీటర్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం వరకు దాదాపు ప్రతి ఇంట్లో గాజు థర్మామీటర్లు ఉండేవి. వీటిలో పాదరసం నింపి ఉండేది. ఒకవేళ థర్మామీటర్ అనుకోకుండా నోటిలో పగిలి, అందులోని పాదరసం నోట్లోకి ప్రవేశిస్తే, భయపడటం సహజం. కానీ, అందరికీ కలిగే సందేహం ఏంటంటే..పాదరసం మింగడం ప్రాణాంతకమా? ఈ పాదరసం శరీరంలోకి ప్రవేశించాక ఏమౌతుంది..? అటువంటి పరిస్థితిలో తక్షణమే ఎలాంటి చర్య తీసుకోవాలి?
జ్వరం వచ్చినప్పుడు ఉష్ణోగ్రతను కొలవడానికి మనం థర్మామీటర్‌ను ఉపయోగిస్తుంటాం. అయితే డిజిటల్ థర్మామీటర్లు రాకముందు, అలాగే ఇప్పటికీ కొన్ని చోట్ల గ్లాస్ థర్మామీటర్లను వాడుతుంటారు. ఇందులో ద్రవరూపంలో ఉండే పాదరసాన్ని ఉపయోగిస్తారు. చిన్న పిల్లలకు లేదా పెద్దలకు ఉష్ణోగ్రత చూసేటప్పుడు అనుకోకుండా థర్మామీటర్ నోటిలో పగిలిపోతే ఏమవుతుంది? పాదరసం మింగితే ప్రాణాపాయమా? అనే విషయాలను తెలుసుకుందాం.
థర్మామీటర్లలోని పాదరసాన్ని లోహ పాదరసం అంటారు. సాధారణంగా ద్రవ రూపంలో ఉండే ఎలిమెంటల్ పాదరసం కడుపులోకి వెళ్తే జీర్ణక్రియ వ్యవస్థ ద్వారా శరీరంలోకి ఇంకిపోదు. ఇది పేగుల గుండా ప్రయాణించి మలం ద్వారా బయటకు వచ్చి వేసే అవకాశం ఉంది. కాబట్టి, పాదరసం పొరపాటున మింగినంత మాత్రాన తక్షణమే ప్రాణాంతకం కాకపోవచ్చు. అయితే అసలు ప్రమాదం వేరే రూపంలో ఉంది.
పాదరసం గది ఉష్ణోగ్రత వద్ద వేగంగా ఆవిరి అవుతుంది. ఈ ఆవిరిని ఊపిరితిత్తుల ద్వారా పీల్చితే అది నేరుగా రక్తంలోకి చేరి నాడీ వ్యవస్థ, మెదడు, మూత్రపిండాల పై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుంది. థర్మామీటర్ గాజు పగిలి నోటిలో లేదా గొంతులో గాయాలైతే, ఆ రక్తనాళాల ద్వారా పాదరసం నేరుగా రక్తంలో కలిసే ప్రమాదం ఉంది. పాదరసం ప్రభావం ఎక్కువైతే వాంతులు, కడుపునొప్పి, నోటిలో లోహపు రుచి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మతిమరుపు వంటి నాడీ సంబంధిత సమస్యలు వస్తాయి.
కంగారు పడకండి.. ముందుగా నోటిలోని గాజు ముక్కలను జాగ్రత్తగా బయటకు తీసి ఉమ్మివేయాలి. మంచి నీటితో నోటిని బాగా పుక్కిలించి ఊసివేయాలి. బలవంతంగా వాంతి చేసుకోవడానికి ప్రయత్నించవద్దు. దీనివల్ల పాదరసం ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి లేదా అత్యవసర వైద్య సేవలను ఆశ్రయించి తగిన పరీక్షలు చేయించుకోవాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..