IRCTC Tour: స్పెషల్ టూర్.. ఒకేసారి సింగపూర్, మలేషియాను చుట్టేయండి!

విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ ఓ అద్భుతమైన అవకాశం అందిస్తోంది. ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యాటక ప్రాంతాల్లో సింగపూర్ ముందుంది. అక్కడి విశాలమైన జూలాజికల్ గార్డెన్‌లు, అందమైన ఉద్యానవనాలు ప్రధాన ఆకర్షణలు. చాలామంది సింగపూర్ వెళ్లాలనుకున్నా, ఖర్చుల గురించి, ప్రయాణం గురించి ఆలోచించి వెనకడుగు వేస్తుంటారు. అటువంటి వారందరి కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ తక్కువ ధరకే అద్భుతమైన ప్యాకేజీని ప్రకటించింది.

IRCTC Tour: స్పెషల్ టూర్.. ఒకేసారి సింగపూర్, మలేషియాను చుట్టేయండి!
Singapore To Malasia Trip

Updated on: Jun 26, 2025 | 6:11 PM

సింగపూర్, మలేషియా వంటి దేశాలను ఒకే యాత్రలో సందర్శించే విధంగా IRCTC “మ్యాజికల్ మలేషియా విత్ సింగపూర్ సెన్సేషన్” పేరుతో ఏడు రోజుల ప్యాకేజీని తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ప్యాకేజీ ఆగస్టు 11వ తేదీన అందుబాటులో ఉంది. ఈ యాత్రకు వెళ్లాలనుకునే వారికి కనీసం 6 నెలల గడువు ఉన్న పాస్‌పోర్ట్ తప్పనిసరి. ఈ టూర్ వివరాలు, ప్రయాణ ప్రణాళిక, ధరలు ఇక్కడ తెలుసుకుందాం.

ప్యాకేజీ వివరాలు

ఈ ప్రత్యేక టూర్ మొత్తం 6 రాత్రులు, 7 పగళ్లు కొనసాగుతుంది. హైదరాబాద్ నుంచి విమాన ప్రయాణం ద్వారా ఈ టూర్ నడుస్తుంది. మొదట బుక్ చేసుకున్న 34 మందికి మాత్రమే ఈ టూర్లో అవకాశం ఉంటుంది.

ప్రణాళిక:

మొదటి రోజు: రాత్రి 7 గంటలకు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రిపోర్ట్ చేయాలి. తతంగాలన్నీ పూర్తైన తర్వాత రాత్రి 11 గంటలకు విమాన ప్రయాణం మొదలవుతుంది.

రెండో రోజు: ఉదయం 10 గంటలకు మలేషియాలోని కౌలాలంపూర్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుండి హోటల్‌కు వెళ్లి, చెక్ ఇన్ అయి, ఫ్రెషప్ అవుతారు. మధ్యాహ్న భోజనం చేశాక స్థానికంగా ఉన్న కింగ్స్ ప్యాలెస్, ఇండిపెండెన్స్ స్క్వేర్, నేషనల్ మాన్యుమెంట్, పెట్రోనాస్ ట్విన్ టవర్ (స్కై బ్రిడ్జ్), చాక్లెట్ ఫ్యాక్టరీని సందర్శిస్తారు. రాత్రి భోజనం చేసి కౌలాలంపూర్‌లో బస చేస్తారు.

మూడో రోజు: ఉదయం అల్పాహారం తర్వాత బటు కేవ్స్‌ను సందర్శిస్తారు. ఆ తర్వాత జెంటింగ్ హైలాండ్స్‌కు వెళ్లి అక్కడ సరదాగా గడుపుతారు. రాత్రికి కౌలాలంపూర్‌కు చేరుకుంటారు. ఆ రాత్రి ఇండియన్ రెస్టారెంట్‌లో భోజనం చేసి, అక్కడే బస చేస్తారు.

నాలుగో రోజు: ఉదయం టిఫిన్ చేశాక చెక్ అవుట్ చేసి పుత్రజయను సందర్శించి భోజనం పూర్తి చేసుకుంటారు. ఆ తర్వాత రోడ్డు మార్గం ద్వారా సింగపూర్‌కు వెళ్తారు. ఆ రాత్రి భోజనం పూర్తి చేసి సింగపూర్‌లో బస చేస్తారు.

ఐదో రోజు: అల్పాహారం తర్వాత సిటీ టూర్ ఉంటుంది. అందులో భాగంగా ఆర్చిడ్ గార్డెన్, మెర్లియన్ పార్క్, సింగపూర్ ఫ్లైయర్ రైడ్‌ను చూస్తారు. భోజనం తర్వాత మేడమ్ టుస్సాడ్స్, వింగ్స్ ఆఫ్ టైమ్‌ను సందర్శిస్తారు. రాత్రి భోజనం చేశాక సింగపూర్ హోటల్‌లో బస చేస్తారు.

ఆరో రోజు: అల్పాహారం తర్వాత యూనివర్సల్ స్టూడియోస్‌ను సందర్శిస్తారు. సాయంత్రానికి తిరిగి హోటల్‌కు చేరుకుని భోజనం పూర్తి చేసి ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు.

ఏడో రోజు: టిఫిన్ చేశాక హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి బర్డ్ ప్యారడైజ్‌ను సందర్శిస్తారు. భోజనం తర్వాత షాపింగ్ చేసుకుని సాయంత్రానికి సింగపూర్ విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు విమాన ప్రయాణం మొదలవుతుంది. హైదరాబాద్ చేరుకోవడంతో యాత్ర పూర్తవుతుంది.

ప్యాకేజీ ధరలు

కంఫర్ట్ క్లాస్:

ఒకరు వెళ్తే: రూ. 1,49,230

ఇద్దరు కలిసి వెళ్తే: రూ. 1,21,980

ముగ్గురు కలిసి వెళ్తే: రూ. 1,21,860

పిల్లలకు (5 నుండి 11 సంవత్సరాల వారు):

బెడ్ తో: రూ. 1,09,560

బెడ్ లేకుండా: రూ. 92,990

ప్యాకేజీలో చేర్చినవి

విమాన టికెట్లు (హైదరాబాద్ – కౌలాలంపూర్ / సింగపూర్ – హైదరాబాద్)

హోటల్ వసతి

5 అల్పాహారాలు, 6 భోజనాలు, 6 రాత్రి భోజనాలు

యాత్ర పూర్తయ్యే వరకు గైడ్ సేవలు

మలేషియా, సింగపూర్ వీసా ఛార్జీలు

ట్రావెల్ ఇన్సూరెన్స్