Telugu News Lifestyle Travel IRCTC Meghalaya Assam Tour Package 2026: 8 Day Trip from Visakhapatnam, Price and Details
IRCTC: మేఘాలయ, అస్సాం అందాలు చూడాలనుకుంటున్నారా? విశాఖ నుంచి 8 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే!
IRCTC Assam-Meghalaya Tour Package 2026 Telugu: మేఘాలయ, అస్సాం ప్రకృతి అందాలను చూడాలనుకునే పర్యాటకులకు IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. విశాఖపట్నం నుంచి విమాన ప్రయాణంతో 8 రోజుల పాటు సాగే ఈ టూర్లో షిల్లాంగ్, చిరపుంజి, డావ్కీ, కాజీరంగా, గువాహటి వంటి అందమైన పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. ప్యాకేజీ ధరలు, ప్రయాణ తేదీలు, పూర్తి వివరాలు తెలుసుకోండి.
IRCTC Assam-Meghalaya Tour Package 2026: ప్రకృతి అందాలు, పచ్చని కొండలు, జలపాతాలు, స్వచ్ఛమైన సరస్సులు, అందమైన గ్రామాలను చూడాలనుకునే పర్యాటకులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అద్భుతమైన టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. Clouds of Meghalaya and Assam పేరుతో మేఘాలయ, అస్సాం రాష్ట్రాల్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా ఈ ప్యాకేజీని రూపొందించింది. విశాఖపట్నం నుంచి విమాన ప్రయాణం ద్వారా ఈ టూర్ ప్రారంభమవుతుంది.
7 రాత్రులు, 8 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో షిల్లాంగ్, చిరపుంజి, డావ్కీ, మావ్లిన్నాంగ్, కాజీరంగా, గువాహటి వంటి ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ కోడ్ SVA02. 2026 డిసెంబర్ 2న విశాఖపట్నం విమానాశ్రయం నుంచి ప్రయాణం ప్రారంభమవుతుంది. మొత్తం 29 మంది పర్యాటకులకు ఈ ప్యాకేజీలో అవకాశం కల్పించారు.
పర్యటనలో సందర్శించే ప్రదేశాలివే..
మొదటి రోజు: డిసెంబర్ 2న మధ్యాహ్నం 12:50 గంటలకు విశాఖపట్నం నుంచి విమానంలో బయలుదేరి, హైదరాబాద్ మీదుగా సాయంత్రం 5:50 గంటలకు గువాహటికి చేరుకుంటారు. అక్కడి నుంచి షిల్లాంగ్‌కు ప్రయాణించి హోటల్లో బస చేస్తారు.
రెండో రోజు: షిల్లాంగ్ నుంచి చిరపుంజికి వెళ్లి ఎలిఫెంటా జలపాతం, నోహ్కలికై జలపాతం, మావ్స్మై గుహలు, సెవెన్ సిస్టర్స్ జలపాతాలను సందర్శిస్తారు.
మూడో రోజు: డావ్కీ సరస్సు అందాలను వీక్షిస్తారు. అనంతరం ఆసియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా పేరొందిన మావ్లిన్నాంగ్ను సందర్శిస్తారు. అక్కడి లివింగ్ రూట్ బ్రిడ్జిని చూడవచ్చు.
నాలుగో రోజు: షిల్లాంగ్‌లో స్థానిక పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారు. డాన్ బాస్కో మ్యూజియం, వార్డ్స్ సరస్సును వీక్షించవచ్చు. సాయంత్రం షాపింగ్ చేసేందుకు సమయం ఉంటుంది.
ఐదో రోజు: షిల్లాంగ్ నుంచి కాజీరంగాకు బయలుదేరుతారు. మార్గమధ్యంలో ఉమియం సరస్సును సందర్శిస్తారు. రాత్రికి కాజీరంగాలో బస చేస్తారు.
ఆరో రోజు: ఉదయాన్నే ఆసక్తి ఉన్నవారు సొంత ఖర్చులతో కాజీరంగా జంగిల్ సఫారీకి వెళ్లవచ్చు. అనంతరం గువాహటికి చేరుకుంటారు.
ఏడో రోజు: గువాహటిలో ప్రసిద్ధ కామాఖ్య దేవాలయాన్ని దర్శించుకుంటారు. మధ్యాహ్నం బ్రహ్మపుత్ర నదిలో క్రూయిజ్ ప్రయాణం చేయవచ్చు. దీనికి అదనపు ఛార్జీలు చెల్లించాలి.
ఎనిమిదో రోజు: డిసెంబర్ 9న ఉదయం అల్పాహారం అనంతరం గువాహటి విమానాశ్రయానికి చేరుకుంటారు. ఉదయం 11:25 గంటలకు విమానంలో బయలుదేరి కోల్‌కతా మీదుగా సాయంత్రం 5:25 గంటలకు విశాఖపట్నం చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది.
ప్యాకేజీ ధరలు ఇలా..
సింగిల్ ఆక్యుపెన్సీ: రూ.75,850
డబుల్ ఆక్యుపెన్సీ: రూ.62,150
ట్రిపుల్ ఆక్యుపెన్సీ: రూ.58,550
పిల్లలు (బెడ్‌తో): రూ.51,350
పిల్లలు (బెడ్ లేకుండా, 5-11 ఏళ్లు): రూ.45,350
పిల్లలు (2-4 ఏళ్లు): రూ.37,600
ప్యాకేజీలో ఏమేం ఉంటాయి?
విశాఖపట్నం నుంచి గువాహటికి వెళ్లి తిరిగి వచ్చే విమాన టికెట్లు, 7 రాత్రుల హోటల్ వసతి, 7 బ్రేక్‌ఫాస్ట్‌లు, 6 డిన్నర్లు, ఏసీ టెంపో ట్రావెలర్ ద్వారా స్థానిక సందర్శనలు, ట్రావెల్ ఇన్సూరెన్స్, IRCTC టూర్ ఎస్కార్ట్ సేవలు ప్యాకేజీలో భాగంగా ఉంటాయి.
అయితే మధ్యాహ్న భోజనం, జంగిల్ సఫారీ, బ్రహ్మపుత్ర క్రూయిజ్, దర్శన టికెట్లు, ఎంట్రీ టికెట్లు, వ్యక్తిగత ఖర్చులు ప్యాకేజీలో ఉండవు. ఆసక్తి ఉన్న పర్యాటకులు IRCTC అధికారిక వెబ్సైట్ ద్వారా ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుని బుకింగ్ చేసుకోవచ్చు.
గమనిక: విమాన సమయాలు, పర్యటన షెడ్యూల్ స్థానిక పరిస్థితులు, నిర్వహణ కారణాలను బట్టి మారే అవకాశం ఉందని IRCTC పేర్కొంది.