
భారతీయ పర్యాటకులు బడ్జెట్‌లో మంచి పర్యాటక అనుభావన్ని పొందాలనుకుంటే భూటన్ అద్భుతమైన ఎంపిక అంటున్నారు టూరిస్ట్ గైడ్‌లు. ఈ దేశంలో పర్యాటకులు స్వచ్ఛమైన పర్యావరణాన్ని ఆస్వాధించవచ్చు. అయితే, భారతీయ పర్యాటకులు ఈ దేశంలోకి వీసా లేకుండానే ప్రవేశించవచ్చట. దీంతో పాటు ఇక్కడి సుందరమైన ప్రదేశాల్లో రవాణా ఖర్చులు, నివాస గృహాలు కూడా తక్కువ ధరల్లోనే లభిస్తాయట.

భారతీయ పర్యాటకులకు తక్కువ ఖర్చుతో ప్రసిద్ధ ప్రదేశాల సందర్శనను అందుబాటులోకి తెచ్చిన మరో దేశం నేపాల్. హిమాలయ పర్వతాల సమీపంలో ఉన్న ఈ దేశం ట్రెక్కింగ్, ఆధ్యాత్మిక అన్వేషకులకు స్వర్గధామం అని చెప్పవచ్చు. అయితే, భారతీయ పర్యాటకులు చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డుతో ఎలాంటి ఆంక్షలు లేకుండా ఈ దేశంలో పర్యటించవచ్చట. ఈ దేశంలోని ప్రసిద్ధ నగరాల్లో రోజువారీ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయట. భారతీయ పర్యాటకులకు అందుబాటు ధరల్లోనే రవాణా, హోటళ్లు లభిస్తాయట.

సుందరమైన బీచ్‌లు, గొప్ప సాంస్కృతిక వారసత్వంతో భారతీయ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోన్న దేశం థాయ్‌ల్యాండ్. ఈ దేశంలో భారతీయ పర్యాటకులు 30 రోజుల వరకు వీసా లేకుండానే పర్యటించవచ్చట. దీనితో పాటు ఈ దేశంలోని ప్రసిద్ధ ప్రదేశాల వద్ద తక్కువ ధరకే వసతి, ఆహారం లభిస్తాయట. దీంతో పర్యాటకులు ఎక్కువ ఖర్చు చేయకుండానే ఆదేశ అందాలను ఆస్వాదించవచ్చు.

వీసా లేకుండానే 30 రోజుల పాటు భారతీయ పర్యాటకులు తమ దేశంలో పర్యటించే అవకాశాన్ని కల్పిస్తున్న మరో దేశం శ్రీలంక. ఈ దేశం భారతదేశానికి కొద్ది దూరంలోనే ఉండడంతో ప్రయాణ ఖర్చు కూడా తక్కువగానే ఉంటుంది. ఈ దేశంలో ప్రశాంతమైన సముద్ర తీరాలు, ప్రాచీన శిధిలాలు, పచ్చని ప్రకృతి పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ ప్రాంతాల్లోని రవాణా ఖర్చులు కూడా పర్యాటకులకు అందుబాటులోనే ఉంటాయట. తక్కువ ఖర్చుతో సుందరమైన ప్రదేశాలను సందర్శించేందుకు శ్రీలంక గొప్ప ఎంపిక అని పర్యాటక ప్రేమికులు చెబుతున్నారు.

విదేశాల పర్యటనకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు తాజాగా వియత్నాం కూడా గుడ్ న్యూస్ చెప్పినట్టు తెలుస్తోంది. ఈ దేశంలో కూడా వీసా లేకుండా భారతీయులు పర్యటించేందుకు అవకాశం కలగనుంది. టూరిస్టులను ఆకర్షించే పథకంలో భాగంగా ఈ యోచనలో ఉన్నట్టు సమాచారం.