
ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరి మనసు కదిలించిన వీడియో అంటే పెంగ్విన్ వీడియోనే. ఇన్ స్టా ఓపెన్ చేస్తే చాలు నిహిలిస్ట్ పెంగ్విన్‌కు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. దీనిని చూసిన చాలా మంది మనసు విరిగితే ఎంత బాధ ఉంటుందో.. దీనిని చూసి అర్థం అవుతుంది అంటున్నారు. ఎందుకంటే? తాను ఏ విషయంలో బాధపడిందో తెలియదు కానీ, జీవితం మీద విరక్తి కలిగిన దానిలా, ఒంటరిగా, తన వాళ్ల నుంచి దూరంగా, మంచు తెలియని ప్రదేశాల వైపు, తన గమ్యం ఏంటో కూడా తెలియకుండా.. ఒంటరిగా వెళ్తుంది. ఈ పెంగ్విన్ వీడియో ప్రతి ఒక్కరి చేత కన్నీరు పెట్టిస్తుంది.

ఇక ఈ వీడియో జీవితానికి సంబంధించిన ఎన్నో ఆలోచనలకు కారణం అవుతుంది. ముఖ్యంగా చాలా మంది ప్రతి పెంగ్విన్ కథ కూడా ఇలానే ఉంటుందని అనుకుంటున్నారు. అయితే ప్రతి పెంగ్విన్ కూడా అస్తిత్వం భయంతో ఉండాల్సిన పని లేదు. చాలా వరకు పెంగ్విన్స్ బీచ్‌లలో తిరగడం, మంచుతో ఆడుకోవడం నీటిలో సందడి చేయడం , అందరితో కలిసి ఉంటూ చాలా సంతోషంగా ఉంటాయి. కాగా, ఇప్పుడు మనం పెంగ్విన్స్ ఆనందంగా ఉండే ప్రదేశాలు ఏవో చూసేద్దా పదండి.

అంటార్కిటికా : పెంగ్విన్ ఆనందంగా ఎక్కువగా ఉండే ప్రదేశం అంటార్కిటికా, ఇక్కడికి పెంగ్విన్ ప్రియులు వెళితే ఆనందం వేరే లెవల్లో ఉంటుంది. ఈ ప్రదేశంలో ఎంపరర్, అడెలీ పెంగ్విన్‌ల వంటి జాతులు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ అనేక రకాల పెంగ్విన్ గుంపులను మీరు చూసి ఆనందించ వచ్చును. అలాగే ఇక్కడ అవి ఆనందంగా కలిసి ఉండటం, ఎంజాయ్ చేయడం చూడవచ్చు.

ఫాక్లాండ్ దీవులు : పెంగ్విన్‌ల స్వర్గధామం ఫాక్లాండ్ దీవులు. ఇది దక్షిణ అట్లాంటిక్ లో ఉంది. ఇక్కడ ప్రజల కంటే పెంగ్విన్స్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ ప్రదేశంలో జెంటూ, కింగ్, రాక్ హాపర్ , మాకరోనీ, మాగెల్లానిక్ పెంగ్విన్‌ల వంటి ఐదు రకాల జాతుల పెంగ్విన్స్ ఇక్కడ దర్శనం ఇస్తాయి.

దక్షిణ జార్జియా : వన్యప్రాణులకు ప్రసిద్ధి చెందిన అద్భుతమైన ప్రదేశం ఇది. దక్షిణ జార్జియా బీచ్లు పది వేల పెంగ్విన్‌లో నిండి ఉన్నాయి. చాలా అద్భుతమైన, అందమైన ప్రదేశంలో ఇదొక్కటి. చాలా మూరుమూల ద్వీపమైన దక్షిణ జార్జియా ఎర్నెస్ట్ షాకిల్టన్ వంటి అన్వేషకులతో ముడిపడి గొప్ప చరిత్రను కలిగి ఉంది. ఇక్కడికి వెళితే పెంగ్విన్స్ ఆనందంగా ఉండటాన్ని చూడవచ్చును.