
ఫ్రిజ్‌లో చెడిపోయిన ఆహారం వలన బ్యాక్టీరియా పెరిగి దుర్వాసన వస్తుంది. సులభంగా శుభ్రం చేసి, వాసనను తొలగించే చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. మనం ఊహించని సమయంలో ఫ్రిజ్ తెరవగానే వచ్చే దుర్వాసన చాలా అసహ్యంగా ఉంటుంది. ఈ వాసన ప్రధానంగా పాత ఆహారం, చెడిపోయిన ఉత్పత్తులు, గడువు ముగిసిన ప్యాక్ చేసిన ఆహారం వలన వస్తుంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లు చెడిపోయి, రసం లీక్ అయినా దుర్వాసన వస్తుంది.
క్రమంగా శుభ్రం చేయండి: వారానికి ఒకసారి ఫ్రిజ్‌ను ఖాళీ చేసి, లోపల ఉన్నవన్నీ తీసి శుభ్రం చేయండి.
బేకింగ్ సోడా: కొద్దిగా వేడి నీటిలో బేకింగ్ సోడా కలిపి, ఆ నీటిలో శుభ్రమైన గుడ్డను ముంచి ఫ్రిజ్‌లోపల రుద్దడం ద్వారా శుభ్రం చేయవచ్చు.
వాసన పీల్చే పదార్థాలు: శుభ్రం చేసినా వాసన ఉంటే, ఒక చిన్న గిన్నెలో బేకింగ్ సోడా ఉంచితే అది లోపల ఉన్న వాసనను గ్రహిస్తుంది. కొంతమంది యాక్టివేటెడ్ చార్‌కోల్ లేదా కాఫీ పౌడర్ లాంటి సహజ పదార్థాలు వాడుతారు.
పైన చెప్పిన చిట్కాలన్నీ పాటించినా వాసన పోకపోతే, ఈ పద్ధతిని పాటించండి:
ఒక ప్లాస్టిక్ కంటైనర్‌లో కొంచెం నీరు తీసుకోండి.
దానిలో సగం నిమ్మకాయ పిండండి. ఆ నిమ్మ తొక్కను కూడా అందులో వేయండి.
దానికి కొన్ని లవంగాలను జోడించండి.
ఈ మిశ్రమాన్ని మూత పెట్టకుండా మీ ఫ్రిజ్‌లో ఉంచండి.
ఇకపై మీరు మీ ఫ్రిజ్ తెరిచినప్పుడల్లా, దాని నుంచి మంచి వాసన వస్తుంది. ఆహారాన్ని తెరిచి ఉంచకుండా సీలు చేసిన డబ్బాల్లో నిల్వ చేయడం, చెడిపోయిన ఆహారాన్ని వెంటనే పారవేయడం చాలా ముఖ్యం.