
మన సమాజంలో విలక్షణమైన మనుషులు కనిపిస్తుంటారు. కొందరు మౌనంగా తమ పని తాము చేసుకుంటూ శిఖరాలను అధిరోహిస్తే, మరికొందరు మాత్రం అడుగు దూరంలో ఉన్న గమ్యాన్ని కూడా సొంతంగా చేరుకోలేక, పక్కవాడి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంటూ ‘బిల్డప్’ ఇస్తుంటారు. సైకాలజీ భాషలో వీరిని రకరకాల పేర్లతో పిలిచినా, వీరి అసలు నైజం మాత్రం ఇతరుల ఆలోచనలను కాపీ కొట్టడం. వీరికి విశ్లేషణాత్మక ఆలోచనలు సున్నా, కానీ ఇతరుల ఐడియాలను దొంగిలించడంలో మాత్రం పీహెచ్‌డీలు చేస్తుంటారు. మౌనంతోనే మేడలు కట్టే రకమైన వీరు, తియ్యటి మాటలతో ఎదుటివారిని బురిడీ కొట్టించడంలో దిట్టలు.
ఇలాంటి వ్యక్తుల వెనుక ఉన్న మానసిక స్థితిని సైకాలజీలో ‘డన్నింగ్ క్రుగర్ ఎఫెక్ట్’ అంటారు. అంటే, ఏ విషయం మీదైతే అవగాహన తక్కువగా ఉంటుందో, వారే తాము మహా మేధావులమని, తమకు అన్నీ తెలుసని భ్రమపడుతుంటారు. ఈ భ్రమలో వారు తమ అజ్ఞానాన్ని కూడా గుర్తించలేరు. అందుకే పక్కవాడు కష్టపడి రూపొందించిన బిజినెస్ ప్లాన్ లేదా ఇతర క్రియేటివ్ పనులను తమ సొంత ఆలోచనలుగా బిల్డప్ ఇస్తుంటారు. వీరిలో సృజనాత్మకత అస్సలు ఉండదు, కేవలం ఇతరుల నీడలో బతకడమే వీరి జీవిత పరమార్థం.
వీరు ఇతరులను తమ వలలో వేసుకోవడానికి ‘లవ్ బాంబింగ్’ అనే సైకలాజికల్ ట్రిక్ ఉపయోగిస్తారు. అవసరం ఉన్నప్పుడు అవతలి వ్యక్తిని ఆకాశానికి ఎత్తుతూ, “నీ అంత గొప్పవాడు లేడు” అంటూ వారి అహాన్ని సంతృప్తి పరుస్తారు. ఇలా తియ్యటి మాటలతో వారిని లోబర్చుకుని, కావాల్సినవన్నీ లాగేస్తారు. తీరా అవసరం తీరిన తర్వాత అదే వ్యక్తిని తొక్కేయడానికి ఏమాత్రం వెనుకాడరు. నిజానికి వీరి లోపల తీవ్రమైన ఆత్మన్యూనత భావం ఉంటుంది, దానిని కప్పిపుచ్చుకోవడానికే ఈ డ్రామాలు ఆడుతుంటారు.
నిజమైన తెలివితేటలు లేని చోట కేవలం ట్రిక్కులు మాత్రమే పనిచేస్తాయి. ఇలాంటి వారు ఎప్పటికీ స్వతంత్రంగా ఎదగలేరు, ఎప్పుడూ ఎవరో ఒకరిని అనుకరిస్తూనే ఉంటారు. నిప్పును ఎంతకాలం దాచలేమో, వీరి అసలు స్వరూపం కూడా ఏదో ఒకరోజు బయటపడుతుంది. మానసిక విశ్లేషకుల ప్రకారం, తియ్యగా మాట్లాడే ప్రతివాడూ శ్రేయోభిలాషి కాదు. మీ పాజిటివ్ ఎనర్జీని ఇలాంటి గాలి బుడగలకు అప్పగించకుండా, మీ ఎదుగుదల కోసం వాడుకోవాలి. సింహంలా ఒంటరిగా వేటాడి ఎదగాలే తప్ప, గొర్రెల్లా గుంపులో ఉంటూ పక్కవారిని అనుసరించకూడదని గుర్తుంచుకోండి.