
ఆరోగ్యంగా తినడం అంటే కేవలం మంచి ఆహారం తీసుకోవడం మాత్రమే కాదు, సరైన ఆహార పదార్థాలను సరైన కాంబినేషన్‌లో తీసుకోవడం కూడా అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని రకాల ఆహారాలు కలిపి తీసుకున్నప్పుడు అవి ఒకదానిలోని పోషకాలను మరొకటి అడ్డుకుంటాయి. పాలక్ పనీర్ విషయంలోనూ ఇదే జరుగుతోందని నమామి అగర్వాల్ వివరిస్తున్నారు. పాలకూరలోని ఐరన్, పనీర్‌లోని కాల్షియం ఒకదానితో ఒకటి పోటీ పడటం వల్ల శరీరానికి వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువని ఆమె చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..
పోషకాల అడ్డంకి
పాలకూరలో ఐరన్ (ఇనుము) పుష్కలంగా ఉంటుంది, పనీర్ కాల్షియానికి నిలయం. అయితే, సైన్స్ ప్రకారం కాల్షియం అనేది ఐరన్ శోషణను అడ్డుకుంటుంది. అంటే మనం పాలక్ పనీర్ తిన్నప్పుడు, పనీర్‌లోని కాల్షియం వల్ల పాలకూరలోని ఐరన్ మన శరీరానికి అందదు. ఫలితంగా ఐరన్ కోసం మనం పాలకూర తిన్నా, దాని వల్ల ఆశించిన ప్రయోజనం కలగదు. పాలకూరలో ఉండే ఆక్సలేట్లు కూడా కాల్షియం ఐరన్ రెండింటి శోషణను పరిమితం చేస్తాయి. దీనివల్ల రెండు పోషకాలూ వృధా అవుతాయి.
ఆయుర్వేదంలో ‘విరుద్ధ ఆహారం’
కేవలం ఆధునిక పోషకాహార శాస్త్రం మాత్రమే కాదు, మన ప్రాచీన ఆయుర్వేదం కూడా కొన్ని ఆహార కలయికలను నిషేధించింది. వీటిని ‘విరుద్ధ ఆహారం’ అని పిలుస్తారు. పాలు చేపలు, అరటిపండు మరియు పాలు, తేనె నెయ్యి (సమాన పరిమాణంలో) వంటి కలయికలు శరీరంలో విషతుల్యాలను పెంచుతాయని ఆయుర్వేదం చెబుతోంది. అదేవిధంగా, పాలకూర పనీర్ కలయిక కూడా శరీరానికి మేలు చేయదని, ఇలాంటి ఆహార అలవాట్లు దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
సరైన పద్ధతి ఏమిటి?
మీకు పాలకూరలోని ఐరన్ పూర్తిస్థాయిలో అందాలంటే దానిని విడిగా లేదా కాల్షియం లేని పదార్థాలతో కలిపి తీసుకోవాలి. ఉదాహరణకు పాలకూర బంగాళాదుంప (పాలక్ ఆలూ) లేదా పాలక్ కార్న్ వంటివి మెరుగైన ప్రత్యామ్నాయాలు. అలాగే పనీర్‌ను కాల్షియం అవసరమైనప్పుడు విడిగా తీసుకోవడం ఉత్తమం. ఆరోగ్యకరమైన ఆహారం తింటున్నప్పుడు, అది శరీరానికి ఎంతవరకు ఉపయోగపడుతుందనే అవగాహన ఉండటం ఎంతో ముఖ్యం.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. ఏదైనా ఆరోగ్య సంబంధిత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి.