Summer Season
ఈ ఏడాది మార్చి నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. మార్చి నుంచే ఈ రేంజ్‌లో ఎండలు ఉండడం వల్ల ఏప్రిల్, మే నెలల్లో ఎండలు ఎలా ఉంటాయోనని చాలా మంది భయపడుతున్నారు. ఈ భయాలను నిజం చేస్తూ కేంద్రం కూడా ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. అంతేకాదు ఈ ఏడాది గతంలో ఎప్పుడూ లేని హీట్ వేవ్స్ వస్తాయని పౌరులు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రకారం 2015 నుంచి 2020 నాటికి ఇటువంటి హీట్ వేవ్స్ బారిన పడిన రాష్ట్రాల సంఖ్య దాదాపు 23కి పెరిగింది. గత 100 ఏళ్లల్లో లేని ఎండలు ఇప్పటికే 2022లో మనం చూశాం. అంతేకాదు అధిక హీట్ వేవ్స్ వల్ల ప్రజలతో పాటు జంతువులు కూడా ఇబ్బందిపడ్డాయి. వేడి తరంగాల వల్ల పంటలు కూడా నాశనమయ్యాయి. విద్యుత్ డిమాండ్ పెరిగిపోవడంతో కొన్ని రాష్ట్రాల్లో కరెంట్ కోతలు కూడా విధించారు. అధిక వేడి వల్ల అనారోగ్యంపై జాతీయ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. పౌరులు వేడి నుంచి రక్షణ కోసం వాటి తప్పనిసరిగా పాటించాలని కోరింది. కేంద్రం విడుదల చేసిన సూచనలు ఏంటో? ఓ లుక్కేద్దాం.
వేడి నుంచి రక్షణకు ఈ సూచనలు పాటించాల్సిందే
- ఎల్లప్పుడు డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండడం కోసం దాహం వేయకపోయినా తరచూ నీటిని తాగాలి.
- సమయానుగుణంగా ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్)ని ఉపయోగించాలి. వాటితో పాటు నిమ్మరసం, మజ్జిగ పాలు/లస్సీ, పండ్ల రసాలు వంటి ఇంట్లో తయారుచేసిన పానీయాలను కొద్దిగా ఉప్పు కలిపి తీసుకోవాలి.
- సన్నగా, వదులుగా, కాటన్ వస్త్రాలను ధరించాలి. అలాగే తప్పనిసరై బయటకు వెళ్లినప్పుడు ఎండ నుంచి రక్షణకు గొడుగు, టోపీ, టవల్ వంటివి ఉపయోగిస్తూ డైరెక్ట్‌గా ఎండ తాకకుండా చూసుకోవాలి.
- స్థానిక వాతావరణ వార్తల కోసం రేడియో, వార్తాపత్రికలు చదవాలని, టీవీలు చూసి అందుకు అనుగుణంగా కార్యచరణ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తప్పనిసరైతేనే బయటకు వెళ్లాని సూచిస్తున్నారు.
- ముఖ్యంగా పగలు కిటికీలు, కర్టెన్‌లను మూసేయాలి. అంతేకాదు సాయంత్రం సమయంలో చల్లటి గాలిని లోపలికి రావడానికి వాటిని మళ్లీ తెరవాలనే విషయాన్ని గమనించాలి.
- శిశువులు, చిన్న పిల్లలు, గర్భిణులు, ఆరుబయట పనిచేసే వ్యక్తులు, మానసిక అనారోగ్యం ఉన్నవారు, శారీరకంగా అనారోగ్యంతో ఉన్నవారు, గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటు ఉన్నవారు, చల్లటి వాతావరణం నుంచి వేడి వాతావరణానికి వచ్చే వ్యక్తులకు అధికంగా వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. అలాంటి వాళ్లు శరీరానికి సరిపడా ద్రవాలను తీసుకోవాలి.
- ముఖ్యంగా మధ్యాహ్నం 12:00 నుంచి 3:00 గంటల మధ్య ఎండలో బయటకు వెళ్లకుండా ఉండాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది. పౌరులు ఎండలో ఉన్నప్పుడు కఠినమైన కార్యకలాపాలకు దూరంగా ఉండాలని పేర్కొంది
- ఎండ ఎక్కువగా ఉండే సమయాల్లో వంట చేయడం మానేయాలి. అలాగే వంట చేసే ప్రదేశాన్ని తగినంతగా వెంటిలేట్ చేయడానికి తలుపులు, కిటికీలు తెరవాలి.
- ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బోనేటేడ్ శీతల పానీయాలు, పెద్ద మొత్తంలో చక్కెరతో కూడిన పానీయాలు తాగడం మానేయాలి. ఎందుకంటే ఇవి ఎక్కువ శరీర ద్రవాన్ని కోల్పోవడానికి కారణం కావచ్చని గుర్తించాలి.
- పార్క్ చేసిన వాహనంలో పిల్లలను లేదా పెంపుడు జంతువులను వదిలకూడదు. ఎందుకంటే వాహనం లోపల ఉష్ణోగ్రత వారి ప్రాణానికే ప్రమాదం తీసుకొస్తుందనే విషయాన్ని గమనించాలి.
- వికారం లేదా వాంతులు, తలనొప్పి, విపరీతమైన దాహం, ముదురు పసుపు మూత్రంతో పాటు మూత్రవిసర్జన తగ్గడం, వేగంగా శ్వాస తీసుకోవడం, అధికంగా గుండె కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్‌ను సంప్రదించాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..