
అందంగా కనిపించడానికి జుట్టు చాలా ముఖ్యం.. అందుకే.. జుట్టు అంటే అందరికీ చాలా ఇష్టం.. వృద్ధాప్యం వచ్చే వరకు ఒత్తుగా, నల్లగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే, ఆధునిక జీవనశైలి, వాతావరణ మార్పుల కారణంగా జుట్టు రాలడం, చిన్న వయసులోనే తెల్లజుట్టు రావడం వంటి సమస్యలు సర్వసాధారణంగా మారాయి. గత 15 ఏళ్లలో ఈ సమస్యలలో గణనీయమైన మార్పులు వచ్చాయని, ప్రస్తుతం 8-10 ఏళ్ల పిల్లలకు కూడా తెల్లజుట్టు వస్తోందని ప్రముఖ హెయిర్ కేర్ నిపుణులు పేర్కొంటున్నారు. 14 ఏళ్ల వయసుకే అబ్బాయిలలో బట్టతల, అమ్మాయిలలో జుట్టు విపరీతంగా రాలడం ఆందోళన కలిగిస్తోందని పలువురు పేర్కొంటున్నారు. ఈ సమస్యలకు కేవలం ఆహారం మాత్రమే కాకుండా, వాతావరణ పరిస్థితులు, తరాలవారీగా వచ్చే జన్యు మార్పులు వంటి అనేక కారణాలున్నాయి. అయితే, సరైన జాగ్రత్తలు, జీవనశైలి మార్పులతో జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
బరువు నియంత్రణ: అధిక బరువు కూడా జుట్టు రాలడానికి ఒక కారణం. బరువు పెరిగిన వారిలో జుట్టు ఎక్కువగా రాలిపోవడాన్ని గమనించవచ్చు.
హార్మోన్ల సమతుల్యత: అమ్మాయిలలో రెగ్యులర్ పీరియడ్స్ రాకపోతే గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి. హార్మోన్ల అసమతుల్యత జుట్టు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
ఒత్తిడి, నిద్ర: ఒత్తిడి అనేది ఈ రోజుల్లో అందరి జీవితాల్లో ఒక భాగం. కానీ, ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటున్నాం, ప్రశాంతంగా నిద్రపోతున్నామా అనేది చాలా ముఖ్యం. తగినంత నిద్ర, ప్రశాంతమైన మనసు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.
రక్తహీనత నివారణ (హిమోగ్లోబిన్): మన దేశంలో చాలా మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు సరిగా లేకపోతే జుట్టు బలహీనపడి రాలిపోతుంది. హిమోగ్లోబిన్ స్థాయిలను పరీక్షించుకుని, అవసరమైతే చికిత్స తీసుకోవాలి.
విటమిన్లు, ఖనిజాలు: కాల్షియం, విటమిన్ బి12, విటమిన్ డి వంటి పోషకాలు జుట్టు ఆరోగ్యానికి చాలా అవసరం. 40 ఏళ్ల తర్వాత ఆహారం ద్వారా ఇవి సరిగా అందకపోతే, డాక్టర్ సలహా మేరకు సప్లిమెంట్స్ తీసుకోవచ్చు.
డాండ్రఫ్ నియంత్రణ: చుండ్రు జుట్టు రాలడానికి ప్రధాన కారణాలలో ఒకటి. డాండ్రఫ్ లేకుండా తలను శుభ్రంగా ఉంచుకోవాలి.
జుట్టుకు బాహ్యంగా ప్రొటీన్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల జుట్టు సిల్కీగా, స్మూత్‌గా తయారవుతుంది, స్ప్లిట్ ఎండ్స్ తగ్గుతాయి. అయితే, పైన పూసిన ప్రొటీన్లు జుట్టు వేర్లలోకి వెళ్లి జుట్టు పెరుగుదలకు నేరుగా తోడ్పడలేవని ప్రముఖ న్యూట్రిషనిస్ట్, బ్యూటీ కాస్మెటాలజిస్ట్ లలితారెడ్డి స్పష్టం చేశారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారం, ఒత్తిడి లేని ప్రశాంత జీవనం జుట్టు ఆరోగ్యానికి కీలకమని ఆమె నొక్కి చెప్పారు. అయితే.. ఏమైనా సమస్యలుంటే.. ముందుగా నిపుణులను సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..