
కొత్త షూ బాక్సులు, హ్యాండ్‌బ్యాగులు లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు కొన్నప్పుడు వాటిలో డోంట్ ఈట్ అని రాసి ఉన్న చిన్న సిలికా జెల్ ప్యాకెట్లు ఉంటాయి. మనం వీటిని పనికిరానివని చెత్తబుట్టలో పడేస్తుంటాం. కానీ, ఇవి గాలిలోని తేమను పీల్చుకుని వస్తువులను పాడవకుండా కాపాడుతాయి. అయితే వీటిని చిన్నపిల్లలు, పెంపుడు జంతువులకు దూరంగా ఉంచాలి. కాబట్టి ఇకపై సిలికా జెల్ ప్యాకెట్లను పారేయకండి. ఇంట్లో వీటి ఉపయోగాలేంటో ఇప్పుడు చూద్దాం..
అనుకోకుండా మీ స్మార్ట్‌ఫోన్ నీళ్లలో పడినా లేదా వర్షంలో తడిసినా సిలికా జెల్ ప్యాకెట్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ముందుగా ఫోన్ పైభాగంలోని నీటిని మెత్తని గుడ్డతో తుడిచి, ఆ తర్వాత కొన్ని సిలికా జెల్ ప్యాకెట్లతో కలిపి ఒక గాలి చొరబడని జిప్-లాక్ బ్యాగ్‌లో రాత్రంతా ఉంచితే లోపలి తేమను పూర్తిగా పీల్చుకుంటాయి.
బాత్రూమ్లో ఉండే తేమ వల్ల షేవింగ్ రేజర్ బ్లేడ్లు త్వరగా తుప్పు పట్టి మొద్దుబారిపోతాయి. ఒక చిన్న డబ్బాలో రేజర్‌తో పాటు ఒకటి రెండు సిలికా జెల్ ప్యాకెట్లు వేసి ఉంచితే బ్లేడ్లు ఎక్కువ కాలం మన్నుతాయి. అలాగే ఇంటి టూల్‌బాక్స్‌లో స్క్రూలు, మేకులు, పనిముట్ల మధ్య వీటిని ఉంచితే తుప్పు పట్టకుండా ఉంటాయి.
వాతావరణంలోని తేమ వల్ల వెండి వస్తువులు, నగలు నల్లబడతాయి. జ్యువెలరీ బాక్స్‌లో ఒక సిలికా జెల్ ప్యాకెట్ ఉంచితే నగలు తమ మెరుపును కోల్పోకుండా ఉంటాయి. అలాగే పాత ఫోటో ఆల్బమ్‌లు, ముఖ్యమైన డాక్యుమెంట్లు, పుస్తకాలు ఉంచే బాక్సులలో వీటిని పెడితే అవి అతుక్కోకుండా, చెమ్మ వాసన రాకుండా తాజాగా ఉంటాయి. కెమెరా లెన్సులు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల బ్యాగుల్లోనూ వీటిని ఉంచితే ఫంగస్ చేరకుండా రక్షణ లభిస్తుంది.
చెమట పట్టిన షూలు లేదా జిమ్ బ్యాగుల్లో తేమ వల్ల దుర్వాసన, బ్యాక్టీరియా పెరుగుతాయి. షూ విప్పిన తర్వాత రాత్రిపూట అందులో సిలికా జెల్ ప్యాకెట్లు ఉంచితే తేమను లాగేసి ఫ్రెష్‌గా ఉంచుతాయి.. బట్టల బీరువాలు, డ్రాయర్లలో ఉంచితే చెమ్మ వాసన రాకుండా ఉంటుంది. కారు డ్యాష్‌బోర్డ్‌పై ఉంచితే చలికాలంలో అద్దాలకు పొగమంచు పట్టడం తగ్గుతుంది.
సిలికా జెల్ ప్యాకెట్లు తినడానికి పనికిరావు కాబట్టి చిన్నపిల్లలు, పెంపుడు జంతువులకు అందకుండా ఉంచాలి. అలాగే వీటిని మైక్రోవేవ్ ఓవెన్లో వేడి చేయకూడదు; ప్యాకెట్ చిరిగిపోతే వెంటనే పారేయాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలతో ఇంట్లో వృథాగా పడేసే సిలికా జెల్ ప్యాకెట్లను ఎంతో తెలివిగా వినియోగించుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..