
భారతీయ వంటకాల్లో ఉల్లిపాయది స్పెషల్ ప్లేస్. కూరల్లో గ్రేవీ రావాలన్నా, బిర్యానీకి టేస్ట్ పెరగాలన్నా, నాన్ వెజ్ వంటల్లో నీచు వాసన పోవాలన్నా ఉల్లిపాయ ఉండాల్సిందే. కేవలం కూరల్లోనే కాదు.. సలాడ్లు, చట్నీలు, శాండ్‌విచ్‌లలో పచ్చి ఉల్లిపాయను నంజుకుని తినడం చాలా మందికి అలవాటు. ఉల్లిపాయల్లో విటమిన్ సి, పవర్‌ఫుల్ యాంటీఆక్సిడెంట్లు, మొక్కల ఆధారిత సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే “ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు” అనే సామెత అందరికీ వర్తించదు. కొన్ని రకాల సున్నితమైన శారీరక తత్వాలు లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉల్లిపాయలను తింటే అనేక తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అసలు ఉల్లిపాయలు ఎవరికి శత్రువులుగా మారతాయో.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం.
పచ్చి ఉల్లిపాయలలో టైరమైన్ అనే ప్రత్యేకమైన అమైనో ఆమ్ల సమ్మేళనం ఉంటుంది. మెడికల్ రీసెర్చ్ ప్రకారం.. కొంతమంది శరీర తత్వానికి ఈ టైరమైన్ అస్సలు పడదు. ఇది లోపలికి వెళ్లగానే రక్తనాళాలపై ప్రభావం చూపి తీవ్రమైన తలనొప్పిని లేదా మైగ్రేన్ ఎటాక్‌ను ట్రిగ్గర్ చేస్తుంది. కాబట్టి మైగ్రేన్ సమస్యతో బాధపడేవారు పచ్చి ఉల్లిపాయ ముక్కలను డైరెక్ట్‌గా తినకపోవడమే మంచిది.
ఉల్లిపాయలలో ఫ్రక్టాన్లు అనే కార్బోహైడ్రేట్లు ఉంటాయి. సాధారణంగా ఇవి కడుపులో మంచి బాక్టీరియాకు ప్రీబయోటిక్స్‌గా పనిచేసి మేలు చేస్తాయి. కానీ ఇప్పటికే ఐబీఎస్ (IBS – సున్నితమైన పేగుల సమస్య), తీవ్రమైన గ్యాస్, కడుపు ఉబ్బరంతో బాధపడేవారిలో ఈ ఫ్రక్టాన్లు సరిగ్గా జీర్ణం కావు. ఫలితంగా పేగుల్లో విపరీతమైన గ్యాస్ చేరి, కడుపునొప్పి, విరేచనాలు లేదా మలబద్ధకానికి దారితీస్తాయి.
జీర్ణాశయంలో యాసిడ్స్ పైకి రావడం లేదా గుండెల్లో మంట వంటి GERD సమస్య ఉన్నవారు రాత్రి పూట పచ్చి ఉల్లిపాయలను అస్సలు ముట్టకూడదు. ఉల్లిపాయలోని సమ్మేళనాలు అన్నవాహిక కింది భాగంలో ఉండే స్పింక్టర్ కండరాన్ని సడలిస్తాయి. దీనివల్ల కడుపులోని యాసిడ్స్ చాలా సులభంగా పైకి తన్నుకొచ్చి, గొంతులో పుల్లటి తేన్పులు, రాత్రంతా గుండెల్లో మంటను కలిగిస్తాయి.
చాలా మందికి తెలియదు కానీ, కొంతమందికి ఉల్లిపాయలు తింటే అలెర్జీ వస్తుంది. పచ్చి ఉల్లిపాయను కోస్తున్నప్పుడు లేదా తింటున్నప్పుడు చర్మంపై దురదలు రావడం, కళ్ల వెంట నీరు కారడం, పెదవులు, నాలుక వాపు రావడం వంటివి జరిగితే మీకు ఉల్లిపాయ అలెర్జీ ఉందని అర్థం. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
కాగా సమస్యలు లేని వారికి ఉల్లిపాయ ఒక సంజీవని లాంటిది.
దీర్ఘకాలిక వ్యాధుల నివారణ: ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. ఇవి మధుమేహం, గుండె జబ్బుల రిస్క్‌ను కూడా తగ్గిస్తాయి.
కంటి చూపు మెరుగు: ఇందులో ఉండే క్వెర్సెటిన్ అనే పవర్‌ఫుల్ యాంటీఆక్సిడెంట్ కంటి కణాలను దెబ్బతినకుండా కాపాడి, చూపును మెరుగుపరుస్తుంది.
మధుమేహానికి బెస్ట్ ఫ్రెండ్: ఉల్లిపాయల గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ మాత్రమే. అందుకే ఇవి తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ అస్సలు పెరగవు. పైగా ఇవి ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడతాయి.
గుండెకు రక్షణ: ఉల్లిపాయలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి, అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.
(గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందించబడింది. మీ ఆహారంలో ఎలాంటి మార్పులు చేయాలన్నా లేదా ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నా ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించవలసిందిగా మనవి.)