రోగాలు రమ్మన్నా రావు.. వర్షాకాలంలో ఇమ్యునిటీ పెంచే సూపర్ ఫుడ్స్‌ ఇవే..

Monsoon Super Foods: వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌లు, ఫంగస్ వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో జీర్ణక్రియ సమస్యలు, ఇన్ఫెక్షన్ల ప్రమాదం కూడా పెరుగుతుంది. ఈ సీజన్‌లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? వేటికి దూరంగా ఉండాలి? పౌష్టికాహార నిపుణులు సూచించిన ముఖ్యమైన విషయాలు ఇవే.

రోగాలు రమ్మన్నా రావు.. వర్షాకాలంలో ఇమ్యునిటీ పెంచే సూపర్ ఫుడ్స్‌ ఇవే..
Monsoon Super Foods

Updated on: Jul 10, 2026 | 6:58 PM

వర్షాకాలంలో మన జీవనశైలితో పాటు ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాలి. లేదంటే అనారోగ్య సమస్యాలను కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది. వర్షాకాలంలో వాతావరణంలో తేమ అధికంగా ఉండటం వల్ల ఆహార పదార్థాల్లో బ్యాక్టీరియా, వైరస్‌లు, ఫంగస్ వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బయట దొరికే ఆహారం, సరిగా శుభ్రం చేయని కూరగాయలు, సరైన పద్ధతిలో నిల్వ చేయని పదార్థాలు ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. అందుకే ఈ కాలంలో తేలికగా జీర్ణం కావడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం.

వర్షాకాలంలో దూరంగా ఉంచాల్సిన 3 ఆహారాలు

1. ఆకుకూరలు

ఆకుకూరల్లో ఐరన్, ఫోలేట్, విటమిన్లు సమృద్ధిగా ఉన్నప్పటికీ.. వర్షాకాలంలో వీటి ఆకులపై మట్టి, సూక్ష్మక్రిములు, పురుగులు ఎక్కువగా చేరే అవకాశం ఉంటుంది. సరిగా శుభ్రం చేయకుండా తీసుకుంటే కడుపు ఇన్ఫెక్షన్లు, గ్యాస్, విరేచనాలు వంటి సమస్యలు రావచ్చు. తినాల్సి వస్తే బాగా కడిగి, పూర్తిగా ఉడికించి తీసుకోవడం మంచిది.

2. క్యాబేజీ, క్యాలీఫ్లవర్

ఈ కూరగాయల పొరల మధ్య చిన్న పురుగులు, మురికి దాగి ఉండే అవకాశం ఎక్కువ. వర్షాకాలంలో ఈ సమస్య మరింత పెరుగుతుంది. అలాగే కొందరిలో ఇవి గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను కూడా కలిగించవచ్చు.

ఇవి కూడా చదవండి

3. పుట్టగొడుగులు

పుట్టగొడుగులు త్వరగా తేమను గ్రహిస్తాయి. నాణ్యత లేని లేదా ఎక్కువసేపు నిల్వ చేసిన మష్రూమ్స్‌పై ఫంగస్, బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. ఇవి తింటే జీర్ణక్రియ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

వర్షాకాలంలో తప్పకుండా తినాల్సిన 4 సూపర్ ఫుడ్స్

1. సొరకాయ

సొరకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇది తేలికగా జీర్ణమవుతుంది. కడుపుపై భారం పడకుండా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

2. గుమ్మడికాయ

విటమిన్-ఎ, పీచు పదార్థం, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే గుమ్మడికాయ రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. శరీరానికి శక్తిని అందిస్తూ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

3. మొక్కజొన్న

వర్షాకాలంలో ఎక్కువగా లభించే మొక్కజొన్నలో ఫైబర్, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగించి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.

4. పప్పుధాన్యాలు, శనగలు

పప్పులు, శనగల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. శరీరంలోని కండరాల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.

వర్షాకాలంలో పాటించాల్సిన ఆరోగ్య చిట్కాలు

  • ఫ్రెష్‌గా.. వేడిగా వండిన ఆహారాన్నే తీసుకోవాలి.
  • పండ్లు, కూరగాయలను శుభ్రంగా కడిగి మాత్రమే వాడాలి.
  • స్ట్రీట్ ఫుడ్, ఎక్కువసేపు బయట ఉంచిన ఆహారాన్ని వీలైనంత వరకు నివారించాలి.
  • తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచాలి.
  • ఇంట్లో తయారుచేసిన సూప్‌లు, పప్పులు, వేడి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం మంచిది.

(Disclaimer: ఈ కథనంలో ఇచ్చిన సమాచారం సాధారణ ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మీకు ఇప్పటికే జీర్ణక్రియ సమస్యలు, అలర్జీలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే, ఆహారంలో మార్పులు చేసేముందు వైద్యుడు లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించడం మంచిది)

Follow Us