
చాలా ఇళ్లలో రాత్రిపూట వచ్చే పెద్ద గురక శబ్దాన్ని ఓ సాధారణ విషయంగానో లేక సరదా అంశంగానో భావిస్తుంటారు. అయితే వైద్య నిపుణుల ప్రకారం.. గురక అనేది కేవలం ఓ అసౌకర్య శబ్దం మాత్రమే కాదు. అది పక్కన పడుకునే వ్యక్తి ఆరోగ్యాన్ని నిశబ్దంగా దెబ్బతీసే తీవ్రమైన సమస్య. గురక పెట్టే వ్యక్తి కంటే కూడా ఆ సౌండ్ వల్ల పక్కన నిద్రలేమితో బాధపడే వారి శారీరక, మానసిక ఆరోగ్యం మరింత తీవ్రంగా ప్రభావితమవుతుందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.
శ్వాసనాళంలోని సాఫ్ట్ కణజాలాల కంపనం వల్ల నిద్రలో ఈ పెద్ద సౌండ్ వస్తుంది. ఈ శబ్దం పక్కనున్న వ్యక్తి గాఢ నిద్రకు పదేపదే భంగం కలిగిస్తుంది. ఫలితంగా శరీరానికి అవసరమైన విశ్రాంతి దక్కక జీవక్రియల లయ పూర్తిగా దెబ్బతింటుంది.
నిరంతర నిద్రలేమి మనిషి ఆరోగ్యంపై పలు రకాలుగా దాడి చేస్తుంది.
హ్యాంగోవర్ వంటి అలసట: రాత్రి సరిగ్గా నిద్రపోని వారు, మరుసటి రోజు ఉదయం మద్యం సేవించిన తర్వాత వచ్చే హ్యాంగోవర్ తరహా తీవ్ర నిద్రమత్తు, అలసట, తలనొప్పిని ఎదుర్కొంటారని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
జ్ఞాపకశక్తి తగ్గడం: నిద్రలేమి కారణంగా మెదడు జ్ఞాపకాలను పూర్తిగా ప్రాసెస్ చేయలేకపోతుంది. దీనివల్ల కాలక్రమేణా మతిమరుపు, పరధ్యానం పెరుగుతాయి.
హార్మోన్ల అసమతుల్యత: గాఢ నిద్ర లేకపోవడం ఒత్తిడి, తీవ్రమైన చిరాకు, హార్మోన్ల హెచ్చుతగ్గులకు దారితీస్తుంది.
దాంపత్య బంధంలో మనస్పర్థలు: ఒకరి గురక వల్ల మరొకరికి సరైన నిద్ర పట్టకపోవడం చివరకు దంపతుల మధ్య అనవసరమైన చిరాకులు, కోపతాపాలు మరియు సంబంధాలలో చీలికలకు కూడా కారణమవుతోంది.
గురక సమస్యను ప్రాథమిక దశలోనే గుర్తించి కొన్ని సహజ మార్పులతో నియంత్రించవచ్చు.
శరీర బరువు తగ్గించుకోవడం: అధిక బరువు వల్ల గొంతు వద్ద ఉండే కొవ్వు శ్వాసనాళాన్ని ఇరుకుగా చేస్తుంది. బరువు తగ్గడం ద్వారా గురకను చాలావరకు అదుపు చేయవచ్చు.
పడుకునే భంగిమ: వెల్లకిలా కాకుండా పక్కకు తిరిగి పడుకోవడం వల్ల శ్వాసనాళం తెరుచుకుని గురక తీవ్రత తగ్గుతుంది.
మద్యపాన నియంత్రణ: ఆల్కహాల్ గొంతు కండరాలను అతిగా సడలిస్తుంది కాబట్టి రాత్రిపూట ఆల్కహాల్ తీసుకోకపోవడం మంచిది.
గురక అనేది ఒక్కోసారి అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అనే ప్రమాదకర శ్వాసకోశ సమస్యకు ప్రధాన సంకేతం కావచ్చు. నిద్రలో అకస్మాత్తుగా శ్వాస ఆగడం, ఊపిరాడక ఉలిక్కిపడి లేవడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. తక్షణమే ఈఎన్‌టీ లేదా స్లీప్ మెడిసిన్ నిపుణులను సంప్రదించి అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.