ఇంత ఈజీనా.. పిల్లలు ఫోన్ వదలట్లేదా.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే వాళ్లే ఇచ్చేస్తారు..

స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, టీవీలు.. నేటి డిజిటల్ యుగంలో పిల్లల జీవితంలో ఇవి ఒక భాగంగా మారాయి. అయితే పరిమితికి మించిన స్క్రీన్ టైమ్ వారి ఆరోగ్యకరమైన నిద్రను, శారీరక ఎదుగుదలను, ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. సడెన్‌గా పిల్లల చేతిలో ఉన్న ఫోన్‌ను గుంజుకుంటే ఏడుపు, మొండితనం పెరిగే ప్రమాదముంది. కొన్ని సింపుల్ టిప్స్‌తో వారికి ఫోన్లను దూరం చేయొచ్చు.

ఇంత ఈజీనా.. పిల్లలు ఫోన్ వదలట్లేదా.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే వాళ్లే ఇచ్చేస్తారు..
How To Reduce Screen Time For Kids
Image Credit source: Pinterest

Updated on: Aug 10, 2026 | 10:24 PM

ఈ రోజుల్లో సెల్ ఫోన్లు, టాబ్లెట్లు, టీవీలు పిల్లల జీవితంలో ఒక భాగమైపోయాయి. అయితే పరిమితికి మించిన స్క్రీన్ టైమ్ పిల్లల నిద్ర, శారీరక ఆరోగ్యం, ఏకాగ్రత, కుటుంబ సమయంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలా అని సడెన్‌గా చేతిలో ఉన్న ఫోన్‌ను గుంజుకుంటే పిల్లల్లో ఏడుపు, కోపం, మొండితనం పెరిగే ప్రమాదం ఉంది. అందుకే, పిల్లల సహకారంతో ప్రశాంతంగా స్క్రీన్ సమయాన్ని తగ్గించడానికి తల్లిదండ్రులు పాటించాల్సిన కొన్ని చిట్కాలు పాటించాలి. అవును.. స్క్రీన్ సమయం ముగిసిందని అకస్మాత్తుగా ఫోన్ లాక్కోవడం సరైన పద్ధతి కాదు. సమయం ముగియడానికి కొన్ని నిమిషాల ముందే పిల్లలకు గుర్తుచేయాలి. ఉదాహరణకు.. ఇంకో 10 నిమిషాల్లో టైమ్ అయిపోతుంది, మరో 5 నిమిషాలు మాత్రమే ఉంది అని చెప్పడం వల్ల వారు మానసికంగా సిద్ధపడతారు. దీనికోసం అలారమ్‌లు లేదా టైమర్లను కూడా ఉపయోగించవచ్చు.

రోజువారీ నిర్దిష్ట షెడ్యూల్

స్క్రీన్ సమయం కోసం ప్రతిరోజూ ఒకే సమయాన్ని కేటాయించాలి. ఉదాహరణకు.. హోమ్‌వర్క్ పూర్తయిన తర్వాత మాత్రమే ఫోన్ ఇవ్వడం. రోజుకో సమయంలో ఫోన్ ఇస్తుంటే పిల్లలు అదనపు సమయం కోసం పట్టుబట్టే అవకాశం ఉంటుంది. స్థిరమైన దినచర్యను పాటిస్తే వారు కూడా నియమాలకు అలవాటు పడతారు.

ఆసక్తికరమైన ప్రత్యామ్నాయాలు

స్క్రీన్ ఆఫ్ చేసిన తర్వాత పిల్లలకు బోర్ కొట్టకుండా, వారి మనస్సును మరల్చే ఆసక్తికరమైన పనులను అందించాలి. డ్రాయింగ్ వేయడం, పుస్తకాలు చదవడం, పజిల్స్ పూర్తి చేయడం లేదా బయటకు వెళ్లి సహచరులతో ఆడుకోవడం వంటి కార్యకలాపాలను ప్రోత్సహించాలి.

నిర్ణయాల్లో పిల్లలకూ భాగస్వామ్యం

నియమాలను తల్లిదండ్రులు మాత్రమే రుద్దకుండా, పిల్లల వయస్సుకు తగినట్లుగా వారికి కొన్ని చిన్న చిన్న ఎంపికలు ఇవ్వాలి. నువ్వు స్నాక్స్ తినడానికి ముందు ఫోన్ చూస్తావా? లేక తిన్న తర్వాత చూస్తావా? అని అడగడం వల్ల తమ అభిప్రాయానికి విలువ ఉందనే భావన పిల్లల్లో కలుగుతుంది.

ప్రశాంతంగా, దృఢంగా వ్యవహరించండి

ఫోన్ కట్టేయమన్నప్పుడు పిల్లలు కోపగించుకున్నా లేదా ఏడ్చినా తల్లిదండ్రులు ఆవేశపడకూడదు. నీకు ఇంకా చూడాలని ఉందనేది నాకు అర్థమైంది, కానీ సమయం అయిపోయింది అని ప్రేమగా, ప్రశాంతంగానే చెప్తూ నియమానికి కట్టుబడి ఉండాలి. అనవసరమైన బేరసారాలకు తావివ్వకూడదు.

సానుకూల ప్రవర్తనను మెచ్చుకోండి

చెప్పిన సమయానికి పిల్లలు అభ్యంతరం చెప్పకుండా ఫోన్ లేదా టీవీ ఆపివేస్తే, వెంటనే ఆ మంచి ప్రవర్తనను అభినందించాలి. ‘‘చెప్పిన మాట విని వెంటనే ఆపేసినందుకు వెరీ గుడ్’’ అని మెచ్చుకోవడం వల్ల భవిష్యత్తులో వారు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. శిక్షల కంటే సానుకూల ప్రోత్సాహం, ముందస్తు ప్రణాళికతో డిజిటల్ పరికరాల వినియోగాన్ని అదుపులో ఉంచవచ్చని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us