
మన దేశంలో తులసి మొక్క లేని ఇల్లు ఉండడం చాలా అరుదు. ఇంటికి పవిత్రతను, అందాన్ని తీసుకురావడమే కాకుండా.. తులసిలో ఉన్న ఔషధ గుణాలు కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. అయితే చాలామంది ఇళ్లలో తులసి మొక్క నాటిన కొద్ది రోజులకే వాడిపోవడం, ఆకులు రాలిపోయి ఎండిపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ సమస్యకు పరిష్కారంగా, తులసి మొక్క ఏడాది పొడవునా పచ్చగా, దట్టంగా పెరిగేందుకు ప్రముఖ గార్డెనింగ్ నిపుణుడు తరుణ్ చోప్రా సోషల్ మీడియాలో కొన్ని విలువైన చిట్కాలను పంచుకున్నారు.
తులసి మొక్క గుబురుగా పెరగకపోవడానికి ప్రధాన కారణం దానిపై వచ్చే పూత లేదా విత్తన మొగ్గలే. మొక్కపై విత్తనాలు పెరిగే కొద్దీ, అది తన పూర్తి శక్తిని కొత్త కొమ్మలు, ఆకులను ఉత్పత్తి చేయడంపై కాకుండా విత్తనాలపైనే కేంద్రీకరిస్తుంది. ఫలితంగా మొక్క ఎదుగుదల ఆగిపోయి త్వరగా ఎండిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే మొక్కపై పూత కనిపించిన వెంటనే వాటిని సున్నితంగా కత్తిరిస్తూ ఉండాలి. దీనివల్ల మొక్క నుంచి సరికొత్త కొమ్మలు వచ్చి పచ్చగా మారుతుంది.
తులసి మొక్క వేర్లకు తగినంత గాలి, పోషకాలు అందాలంటే కుండీలోని మట్టిని అప్పుడప్పుడు వదులు చేస్తూ ఉండాలి. మొక్క ప్రధాన వేర్లకు ఎలాంటి గాయం కాకుండా జాగ్రత్త వహిస్తూ, చిన్న పరికరంతో పై మట్టిని సున్నితంగా కలపడం లేదా గుల్ల చేయడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల వేర్ల వ్యవస్థ బలోపేతమవుతుంది.
మొక్క ఎదుగుదలకు పోషకాలు అత్యంత అవసరం. తులసి మొక్క ఆరోగ్యంగా ఉండాలంటే సంవత్సరానికి కనీసం రెండు లేదా మూడు సార్లు 150 నుంచి 200 గ్రాముల వర్మీకంపోస్ట్ ఎరువును కుండీలో వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. సహజసిద్ధమైన ఈ సేంద్రియ ఎరువు మొక్కకు అవసరమైన స్థూల, సూక్ష్మ పోషకాలను అందించి ఆకులు ఎల్లప్పుడూ నిగనిగలాడేలా చేస్తుంది.
మొక్క నాటే కుండీ పరిమాణం కూడా దాని ఆయుష్షును నిర్ణయిస్తుంది. తులసి మొక్క వేర్లు స్వేచ్ఛగా వ్యాపించేందుకు కనీసం 12 నుంచి 15 అంగుళాల లోతు, వెడల్పు ఉన్న కుండీని మాత్రమే ఎంచుకోవాలి. మరీ చిన్న కుండీలలో నాటితే వేర్లు ఇరుకై మొక్క త్వరగా వాడిపోతుంది.
వాతావరణ మార్పుల ప్రభావం తులసిపై తీవ్రంగా ఉంటుంది. విపరీతమైన ఎండ కాసేటప్పుడు లేదా తీవ్రమైన చలిగాలులు, మంచు కురిసే సమయాల్లో మొక్కను కాస్త నీడ ఉన్న ప్రదేశానికి మార్చడం మంచిది. సీజన్‌కు తగినట్టుగా కుండీ ఉండే స్థానాన్ని మార్చడం వల్ల మొక్క సురక్షితంగా ఉంటుంది.
తులసి మొక్క ఎండిపోవడానికి అత్యధికంగా కారణమయ్యే అంశం అతిగా నీరు పోయడమే. నిత్య పూజల పేరుతో ఎక్కువ నీళ్లు పోస్తే వేర్లు కుళ్లిపోతాయి. కుండీలోని పైమట్టి ఎండిపోయినట్లు అనిపించినప్పుడు లేదా తేమ తగ్గినప్పుడు మాత్రమే కొద్దిగా నీరు పోయాలి.
ఈ సులభమైన చిట్కాలను పాటిస్తే మీ ఇంట్లోని తులసి మొక్క ఏళ్ల తరబడి పచ్చగా, ఏపుగా, కలకలలాడుతూ ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.