
మునక్కాయ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు. నాన్‌వెజ్ ప్రియులకు చికెన్, మటన్ ఎలాగో.. శాఖాహారులకు మునక్కాయ అలా అని చెప్పొచ్చు. కొంతమంది అయితే దీనిని పేదవాడి మటన్ అని పిలుస్తుంటారు. మునక్కాయ ముక్కల్లోని గుజ్జును జుర్రుకుని తింటుంటే.. మటన్ నల్లిబొక్కను జుర్రినట్లే ఉంటుందని అంటుంటారు. అంతేకాదు శరీరానికి మేలు చేసే ఎన్నో అద్భుతమైన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు మునగలో పుష్కలంగా ఉన్నాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే చాలామంది తమ ఇంటి దగ్గరో, పొలం గట్టునో ఒక మునగ చెట్టును నాటుకుంటారు. అయితే మునగ చెట్టు పెంచడం చూడటానికి సులభంగా అనిపించినా.. అందులో కొన్ని క్లిష్టమైన సమస్యలు ఉన్నాయి. చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య ఏంటంటే.. ‘‘చెట్టు నిండా పూత విపరీతంగా పూస్తుంది.. కానీ ఒక్క కాయ కూడా కాకుండానే పూలన్నీ రాలిపోతాయి.’’ మీ చెట్టు పరిస్థితి కూడా ఇంతేనా? అయితే అస్సలు కంగారుపడకండి. కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు.. మీ మునగ చెట్టు కాయలతో కళకళలాడుతుంది.
మునగ సాగులో నీటి నిర్వహణ చాలా భిన్నంగా ఉంటుంది. చాలామంది చెట్టుకు పూత రాగానే ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని రోజూ బకెట్ల కొద్దీ నీళ్లు పోస్తుంటారు. కానీ శాస్త్రీయంగా ఇది తప్పు. మునగ చెట్టు పూత దశకు వచ్చినప్పుడు నీరు పెట్టడం బాగా తగ్గించాలి. నేలలో తేమ ఎక్కువైతే చెట్టు హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని పూత రాలిపోతుంది. అయితే ఒకసారి పూలన్నీ చిన్న పిందెలుగా మారిన తర్వాత మాత్రం చెట్టుకు సరిపడా నీటిని క్రమం తప్పకుండా అందించాలి. అప్పుడు కాయలు త్వరగా లావు అవుతాయి.
సంవత్సరానికి రెండుసార్లు మునగ చెట్టుకు ప్రత్యేక పోషణ అవసరం. వర్షాకాలం ప్రారంభానికి ముందు, వర్షాకాలం ముగిసిన తర్వాత చెట్టు మొదలుకు ఒకట్రెండు అడుగుల దూరంలో వృత్తాకారంలో పాదులు చేయాలి. ఈ పాదుల్లో పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్ లేదా కోళ్ల ఎరువు వేసి మట్టితో కప్పాలి. ఇది చెట్టుకు అవసరమైన నైట్రోజన్ అందించి, సరికొత్త కొమ్మలు రావడానికి, చెట్టు ఏపుగా పెరగడానికి సహాయపడుతుంది.
పూర్వకాలం నుండి మన పెద్దలు పాటిస్తున్న అద్భుతమైన చిట్కా ఇది. మునగ చెట్టుకు బూడిద ఒక టానిక్‌లా పనిచేస్తుంది. కట్టెల పొయ్యి నుంచి వచ్చే బూడిదను చెట్టు మొదట్లో నేరుగా చల్లవచ్చు లేదా ఎండిన మునగ ఆకులతో కలిపి వేయవచ్చు. బూడిదలో సహజసిద్ధమైన పొటాషియం, క్యాల్షియం ఉంటాయి. పొటాషియం లోపం వల్లే మునగ పూత నిలబడదు. కాబట్టి బూడిద వేయడం వల్ల పూత రాలడం ఆగిపోవడమే కాకుండా కాసే కాయలు కూడా గట్టిగా, పొడవుగా పెరుగుతాయి.
ఇది ఖర్చు లేని అద్భుతమైన దేశవాళీ చిట్కా. ఇంట్లో మిగిలిపోయిన మజ్జిగను 4,5 రోజుల పాటు పక్కన పెడితే అది బాగా పులుస్తుంది. ఈ పుల్లటి మజ్జిగను లేదా అన్నం వండిన గంజిని నీళ్లలో బాగా కలిపి చెట్టు ఆకులు, పూల మొగ్గలపై స్ప్రే చేయాలి. ఇందులోని లాక్టోబాసిల్లస్, పోషకాలు చెట్టుకు మంచి శక్తిని ఇస్తాయి. ఇది పూత రాలడాన్ని తక్షణమే అడ్డుకునే అద్భుతమైన గ్రోత్ ప్రమోటర్‌గా పనిచేస్తుంది.
కొన్నిసార్లు చెట్టుకు వాతావరణం బాగున్నా, ఎరువులు వేసినా పూత నిలబడదు. చెట్టుకు పూత విపరీతంగా వచ్చి, ఒక్క కాయ కూడా కాకుండా రాలిపోతుంటే దానికి బోరాన్ లోపం ఉందని అర్థం. లీటర్ నీటికి 2 గ్రాముల బోరాన్ పొడిని కలిపి పూత దశలో చెట్టుపై స్ప్రే చేస్తే పిందె కట్టే సామర్థ్యం పెరుగుతుంది.
మునగ చెట్టుకు భూమి ద్వారా వచ్చే వేరుకుళ్లు తెగులు, ఆకులపై వచ్చే మచ్చల తెగులు పెద్ద శాపాలు. ఇవి చెట్టును లోపలి నుంచి బలహీనపరుస్తాయి. దీని నివారణకు సూడోమోనాస్ అనే జీవ శిలీంద్ర నాశిని అద్భుతంగా పనిచేస్తుంది. 20 గ్రాముల సూడోమోనాస్ పొడిని ఒక లీటర్ నీటిలో కలిపి చెట్టు మొదట్లో పోయాలి. ఇది చెట్టుకు సహజసిద్ధమైన రోగనిరోధక శక్తిని పెంచి, తెగుళ్ల బారిన పడకుండా కాపాడుతుంది.
మునగ కాయలు చిన్న పిందెలుగా ఉన్నప్పుడే వాటికి కాయతొలిచే ఈగల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఈ ఈగలు కాయలపై రంధ్రాలు చేసి లోపల గుడ్లు పెడతాయి. దీనివల్ల కాయలు కుళ్లిపోయి, వంకర్లు తిరిగి రాలిపోతాయి. తోటల్లో అయితే దీనికోసం ఫెర్మోన్ ట్రాప్స్ పెడతారు. కానీ ఇంటి పెరట్లో అయితే.. కాయలు చిన్నగా ఉన్నప్పుడే గాలి ఆడేలా చిన్న రంధ్రాలున్న ప్లాస్టిక్ కవర్లు లేదా నెట్ బ్యాగులతో కప్పడం ద్వారా ఈగలు గుడ్లు పెట్టకుండా సులభంగా ఆపవచ్చు.
చెట్టు ఏపుగా, బలంగా పెరగడానికి ఇదొక సూపర్ ఫుడ్. వేరుశనగ చెక్క, వేప పిండిని సమపాళ్లలో తీసుకుని ఒక బకెట్ నీటిలో వేసి 4 నుండి 5 రోజుల పాటు బాగా పులియబెట్టాలి. రోజుకు ఒకసారి కర్రతో కలపాలి. 5 రోజుల తర్వాత తయారైన ఈ ద్రావణాన్ని మరికొన్ని నీళ్లలో కలిపి నెలకు ఒకసారి చెట్టు మొదట్లో పోయాలి. వేప పిండి వల్ల వేర్లకు పురుగులు పట్టవు, వేరుశనగ చెక్క వల్ల చెట్టుకు కావలసిన అన్ని రకాల పోషకాలు అంది ఏడాది పొడవునా కాయలు కాస్తుంది.