
వెండి పట్టీలు, కాలి మెట్టెలు, ఇతర ఆభరణాలను రోజూ ధరించడం వల్ల గాలిలోని తేమ, చెమట ప్రభావంతో అవి త్వరగానే నల్లబడిపోతుంటాయి. అలా నల్లబడిన ప్రతిసారీ పాలిష్ చేయించడానికి నగల దుకాణాల చుట్టూ తిరుగుతూ డబ్బులు ఖర్చు చేస్తుంటారు చాలామంది. అయితే రూపాయి ఖర్చు లేకుండా, ఇంట్లో ఉండే సాధారణ వంటింటి వస్తువులతోనే వెండి ఆభరణాల పాత మెరుపును తిరిగి తీసుకురావచ్చు. నిమిషాల వ్యవధిలోనే నల్లదనం పోయి సరికొత్తగా మెరిసేలా చేసే ఆ సులభమైన చిట్కాలు ఏంటో చూద్దాం.
ఒక గిన్నెలో అల్యూమినియం ఫాయిల్‌ను అడుగుభాగం కవర్ అయ్యేలా పరచండి. అందులో బాగా మరిగిన వేడినీళ్లు పోసి, ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి కలపాలి. ఇప్పుడు నల్లబడిన వెండి పట్టీలను ఆ నీటిలో వేయండి. వేడినీరు, బేకింగ్ సోడా మరియు అల్యూమినియం ఫాయిల్ మధ్య జరిగే రసాయన చర్య వల్ల వెండిపై పేరుకుపోయిన నలుపు క్షణాల్లో తొలగిపోయి, పట్టీలు సరికొత్త వాటిలా ధగధగా మెరుస్తాయి.
ఇంట్లో రోజూ వాడే సాధారణ తెల్లటి టూత్‌పేస్ట్ వెండిని మెరిపించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఒక పాత, మృదువైన టూత్‌బ్రష్‌కు కొద్దిగా పేస్ట్ తీసుకుని పట్టీలు, గొలుసులపై సున్నితంగా రుద్దండి. సందుల్లో పేరుకున్న మురికి వదిలేలా నెమ్మదిగా బ్రష్ చేసి, ఒక 5 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగి మెత్తటి పొడి గుడ్డతో తుడుచుకుంటే చాలు.
ఎంతో కాలంగా వాడకుండా పక్కన పెట్టి విపరీతంగా నల్లబడిన వెండి వస్తువులకు వెనిగర్ బెస్ట్ రెమెడీ. అర కప్పు వెనిగర్‌లో రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా కలపండి. ఆ ద్రావణంలో నల్లబడిన వెండి ఆభరణాలను వేసి 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టాలి. అనంతరం వాటిని బయటకు తీసి చల్లటి నీటితో కడిగి తుడిస్తే మొండి నల్లటి మరకలు పూర్తిగా మాయమవుతాయి.
ఒక గిన్నెడు వేడి నీటిలో ఒక నిమ్మకాయ రసం పిండి, ఒక చెంచా ఉప్పు కలపండి. ఈ మిశ్రమంలో వెండి పట్టీలను కేవలం 5 నిమిషాల పాటు నానబెట్టండి. నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ నలుపును త్వరగా కరిగిస్తుంది. 5 నిమిషాల తర్వాత పట్టీలను బయటకు తీసి మెత్తటి కాటన్ గుడ్డతో తుడిస్తే సహజమైన మెరుపు మీ సొంతమవుతుంది.
కేవలం చిన్నపాటి మురికి, జిడ్డును వదిలించుకోవడానికి గోరువెచ్చని నీటిలో కొద్దిగా డిష్‌వాష్ లిక్విడ్ కలిపి, పట్టీల సందుల్లో మృదువైన బ్రష్‌తో రుద్ది కడిగితే సరిపోతుంది. అలాగే ఎక్కడికైనా అర్జెంట్‌గా వెళ్లాల్సి వచ్చినప్పుడు శానిటైజర్ చక్కగా ఉపయోగపడుతుంది. ఒక దూది లేదా టిష్యూ పేపర్‌పై కొన్ని చుక్కల శానిటైజర్ వేసి పట్టీలపై సున్నితంగా రుద్దితే పైపైనున్న స్వల్ప నల్లదనం క్షణాల్లో మాయమై తక్షణ మెరుపు వస్తుంది.