కిలో బరువు తగ్గడానికి ఎన్ని అడుగులు నడవాలో తెలుసా.. లెక్క చూస్తే అవాక్కే..

జిమ్‌కు వెళ్లకుండానే బరువు తగ్గాలనుకుంటున్నారా.. కేవలం వాకింగ్‌తోనే ఈజీగా బరువు తగ్గొచ్చు. కానీ కొవ్వును ఎలా కరిగించాలి అనేది తెలుసుకోవడం ముఖ్యం. ఫిట్‌నెస్ నిపుణుల ప్రకారం.. 1 కిలో కొవ్వు అంటే 7700 కేలరీలు. దీన్ని కరిగించడానికి ఎన్ని అడుగులు నడవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

కిలో బరువు తగ్గడానికి ఎన్ని అడుగులు నడవాలో తెలుసా.. లెక్క చూస్తే అవాక్కే..
How Many Steps To Walk To Lose 1kg Fat

Updated on: Dec 27, 2025 | 2:48 PM

చాలా మంది బరువు తగ్గాలి అంటే జిమ్‌లో గంటల కొద్దీ కష్టపడాలని, చెమటలు చిందేలా భారీ వ్యాయామాలు చేయాలని భావిస్తారు. కానీ సరైన పద్ధతిలో నడిస్తే చాలు.. ఎటువంటి అలసట లేకుండానే ఒంట్లోని కొవ్వును కరిగించవచ్చని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు. ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్ అంజలి సచన్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా 1 కిలో కొవ్వును తగ్గించుకోవడానికి ఎంత దూరం నడవాలో వివరించారు.

1 కిలో కొవ్వు = 7700 కేలరీలు

మనం బరువు తగ్గడం అంటే కేవలం శరీరంలోని నీటి శాతం తగ్గడం కాదు నిల్వ ఉన్న వాస్తవ కొవ్వు కరగాలి. అంజలి సచన్ వివరణ ప్రకారం.. 1 కిలో కొవ్వు సుమారు 7,700 కేలరీలకు సమానం. ఈ కొవ్వు అనేది శరీరంలో శక్తి రూపంలో నిల్వ ఉంటుంది. ఒకసారి ఈ కొవ్వును కరిగించగలిగితే అది మళ్ళీ రాకుండా శాశ్వతంగా మాయమవుతుంది.

నడకతో కేలరీల లెక్క ఇలా..

నడక ద్వారా మనం ఎంత కేలరీలు ఖర్చు చేస్తామనేది ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి 1,000 అడుగులకు దాదాపు 50 నుండి 70 కేలరీలు బర్న్ అవుతాయి. నడిచేటప్పుడు శరీరం కండరాల కదలికలకు, బ్యాలెన్స్ కోసం, హృదయ స్పందనను స్థిరంగా ఉంచడానికి శక్తిని వాడుకుంటుంది.

ఇవి కూడా చదవండి

1 కిలో తగ్గడానికి ఎన్ని అడుగులు వేయాలి?

లెక్కల ప్రకారం చూస్తే.. ఒక కిలో కొవ్వు తగ్గడానికి సగటున 1,28,000 నుండి 1,50,000 అడుగులు నడవాల్సి ఉంటుంది. ఇది వినడానికి పెద్ద సంఖ్యలా అనిపించినా ప్రణాళికాబద్ధంగా చేస్తే చాలా సులభం. ప్రతి రోజూ 10వేల నుంచి 15వేల అడుగులు నడిస్తే 10 నుంచి 12 రోజుల్లోనే ఎటువంటి కఠినమైన వ్యాయామాలు లేకుండానే ఒక కిలో కొవ్వును వదిలించుకోవచ్చు.

నడక వల్ల కలిగే అదనపు ప్రయోజనాలు

తీవ్రమైన వ్యాయామాలతో పోలిస్తే నడక ఎందుకు ఉత్తమమైనదో అంజలి కొన్ని కారణాలను వివరించారు

ఆకలి నియంత్రణ: కఠినమైన వర్కవుట్స్ చేస్తే ఆకలి ఎక్కువగా వేస్తుంది, కానీ నడక వల్ల ఆకలి అదుపులో ఉంటుంది.

హార్మోన్ల సమతుల్యత: ఇది హార్మోన్లపై లేదా మహిళల్లో ఋతు చక్రంపై ప్రతికూల ప్రభావం చూపదు.

మానసిక ప్రశాంతత: నడక అలసటను కలిగించకపోగా, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

స్థిరత్వం: బరువు తగ్గడం అనేది రాత్రికి రాత్రే జరిగే మ్యాజిక్ కాదు, రోజువారీ అలవాట్ల ద్వారా వచ్చే స్థిరమైన ఫలితం.

జిమ్‌కి వెళ్లి భారీ బరువులు ఎత్తలేమని బాధపడేవారికి నడక ఒక అద్భుతమైన వరం. క్రమం తప్పకుండా ప్రతిరోజూ అడుగులు వేస్తూ సరైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యకరంగా బరువు తగ్గడం మీ చేతుల్లోనే ఉంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.