
కాలం మారింది.. మనుషులు మారుతున్నారు.. మనుషులతో పాటు పరిసరాలూ మారుతున్నాయి. గతంలో వంట చేసేందుకు వంటగదిలో చిన్న మట్టి పొయ్యి, కట్టెలు ఉండేవి. ఇప్పుడు ప్రతి ఇంటా గ్యాస్ పొయ్యి రెడీగా ఉంది. వంట కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఇక కాలం మారుతున్నా కొద్ది.. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నా కొద్ది వంట గదిలోనూ మార్పులు వస్తున్నాయి. వంటల కోసం ఉపయోగించే వస్తువులు కూడా అప్‌గ్రేడ్ అవుతున్నాయి. ఇటీవలి కాలంలో వంటగదిలో కనిపించే కామన్ వస్తువు ‘మైక్రోవేవ్’. అవును, చాలా మంది ఇళ్లలో మైక్రోవేవ్ ఒక భాగమైపోయింది. వండిన ఆహారం చల్లబడితే.. వెంటనే మైక్రోవేవ్‌లో వేడి చేసి తినేస్తుంటారు. అయితే, మైక్రోవేవ్‌లో వేడి చేసిన ఆహారం తినాలా? వద్దా? అనే అంశంలో చాలా మందికి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు సమస్యలొస్తాయంటే.. మరికొందరు అలా ఏం కాదని చెబుతుంటారు. మరి వాస్తవానికి మైక్రోవేవ్‌లో ఆహారాన్ని వండొచ్చా? అందులో వేడి చేసింది తినొచ్చా? కీలక వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
మైక్రోవేవ్‌లో వేడిచేసిన ఆహారం ఏమాత్రం హానికరం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చెబుతోంది. అయితే దీనితో పాటు డబ్ల్యూహెచ్‌ఓ కూడా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించింది. మైక్రోవేవ్‌లో ఆహారాన్ని వేడి చేయడం వలన పోషకాలు ప్రభావితం అవుతాయని తెలిపింది. మైక్రోవేవ్‌లో అధిక ఉష్ణోగ్రత కారణంగా విటమిన్ B12 ధ్వంసం అవుతుంది. మైక్రోవేవ్‌లో మంచి లక్షణం ఏంటంటే.. ఆహారం త్వరగా వేడి అవుతుంది. అయితే, అదే సమయంలో ఆ వేడి కారణంగా కొన్ని పోషకాలు విచ్చిన్నమైపోతాయి.
చాలా మంది మైక్రోవేవ్‌లో ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తుంటారు. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. మైక్రోవేవ్ ఉష్ణోగ్రత ప్లాస్టిక్ టాక్సిక్ పాలిమర్ల కణాలను విచ్ఛిన్నం చేస్తుంది. అవి ఆహారంలో కలిసిపోతాయి. వాటిని మనం తినడం ద్వారా శరీరంలోకి వెళ్లి హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. జీవక్రియ వ్యవస్థను నాశనం చేస్తుంది. అందుకే.. ఇలా చేయడం నివారించాలి.
మైక్రోవేవ్‌ను ఆహారాన్ని వేడి చేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు. ఎందుకంటే ఆహారంలో ఉండే బ్యాక్టీరియా చనిపోతుంది. కొందరు పదే పదే వేడి చేస్తుంటారు. ఇది సరైంది కాదని నిపుణులు చెబుతున్నారు. మైక్రోవేవ్‌లో ఆహారాన్ని రెండుసార్లకు మించి వేడి చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాగే, 82 సెల్సియస్ కంటే ఎక్కువ వేడి చేయకూడదు. ఇక ఆహారాన్ని మైక్రోవేవ్‌లో చాలా జాగ్రత్తగా వేడి చేయాలి. ఎందుకంటే అంచుల వద్ద ఉన్న ఆహారం త్వరగా వేడిగా అవుతుంది. మధ్యలో ఉన్న ఆహారం చల్లగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు.
కొంతమంది రేడియేషన్ గురించి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. కానీ WHO దానిని తోసిపుచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. మైక్రోవేవ్‌లో ఆహారాన్ని వేడి చేయడం ద్వారా రేడియేషన్ ప్రభావం ఏమీ ఉండదని తెలిపింది. మైక్రోవేవ్‌లలో లైట్ ఫ్రీక్వెన్సీ అయస్కాంత కిరణాలను ఉపయోగిస్తారు. అదే సామర్థ్యం గల రేడియేషన్ లైట్ బల్బులలో కూడా ఉపయోగించబడుతుంది.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..